మేడ్చల్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంంత్రం జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో నిందితులను 12 గంటలలోపే మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి 2 రెండు కత్తులు, 4 సెల్‌ఫోన్లు 2 రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డికి చెందిన ఉమేష్ కుటుంబం లేబర్ వృత్తి చేసుకుంటూ మేడ్చల్‌లో నివాసం ఉంటున్నారు. ఉమేష్ రోజూ మద్యం సేవిస్తూ తన తల్లితో గొడవపడేవాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా తన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగుచెందిన తమ్ముడు రాకేష్ మరో సోదరుడు వరుసైన లక్ష్మణ్, మరో ముగ్గురు సహాయంతో మేడ్చల్‌లో నడిరోడ్డుపై కత్తులతో నరికి హత్య చేశారు.
మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన అతని తమ్ముడు రాకేష్ హత్య చేసినట్లు తెలిపారు. కాగా, హత్యకు గురైన ఉమేష్‌పై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో 14 కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులు గూగులోత్ రాకేష్ (19), గూగులోత్ లక్షణ్ (20), బుక్యా నవీన్ (21), బుక్యా సురేష్ (21), బుక్యా నరేష్ (21) లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. హత్య కేసును ఛేదించేందుకు కృషి చేసిన మేడ్చల్ జోన్ ఏసిపి బి.శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, డిఐ సుధీర్, ఎస్‌ఐలు మన్మధరావు, అశోక్, అనిత, మేడ్చల్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.