శ్రీనగర్ : అమర్‌నాథ్ యాత్రలో పలు విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు యాత్రికులు మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికార యంత్రాంగం బుధవారం నిర్థారించింది. వీరి మృతికి గుండెపోటే కారణం అని వెల్లడైంది. హిమాలయాల అత్యున్నత ప్రాంతాల్లో సాగే యాత్ర దశలో ఎత్తు ప్రాంతాలకు వెళ్లుతున్న కొద్దీ ఆక్సిజన్ సాంద్రత పడిపోతూ రావడంతో హృద్రోగ లక్షణాలు ఉన్న వారికి గుండెపోటు సంభవిస్తూ ఉంటుంది. దీనితోనే ఇప్పుడు ఐదుగురు చనిపోయినట్లు వెల్లడైంది.
దీనితో యాత్ర ఆరంభం నుంచి ఇప్పటివరకూ మొత్తం మృతుల సంఖ్య 19కు చేరుకుంది. ఇప్పుడు మృతి చెందిన యాత్రికులలో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. ఇద్దరు యుపికి చెందిన వారు ఉన్నారని తెలిసింది. మరో వ్యక్తి ఎవరనేది నిర్థారించాల్సి ఉంది. వాతావరణ అసాధారణ పరిస్థితులతోనే తట్టుకోలేక ఈ దారిలో వెళ్లే వారిలో కొందరు చనిపోతారు. ఈ నెల 1 నుంచి మొదలైన ఈ వార్షిక యాత్ర నెలాఖరు వరకూ ఉంటుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున్న ఈ ఆలయం ఉంది. ఇప్పటివరకూ ఈ క్షేత్రాన్ని పలు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారీ వర్షాలు సాగినప్పటికీ 1,37,353 మంది యాత్రికులు సందర్శించారు.