Monday, January 20, 2025

కశ్మీర్ లో ఉగ్ర పంజా..ఐదుగురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదుల చర్యలో ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ అధికారితో పాటు పలువురు ఇతరులు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో సైన్యం ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల గాలింపు దశలో ఉండగా జరిగిన పేలుళ్లలో ఐదుగురు సైనికులు చనిపోయినట్లు, కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు వీరిని ఉధంపూర్‌లోని సైనిక ఆసుపత్రికి చికిత్సకు తరలించినట్లు సైనిక అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆ తరువాత చనిపోయినట్లు వెల్లడైంది.

కండి ప్రాంతంలో కేసరి పర్వతాల్లో ఓ గుహలో ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నట్లు తెలియడంతో వీరి కోసం ఆర్మీ అక్కడికి వెళ్లింది. ముందుకు దూసుకుపోతున్న సైన్యంపై ఉగ్రవాదులు అదునుచూసుకుని పేలుళ్లకు దిగినట్లు వెల్లడైంది.చాలా సేపటివరకూ ఇక్కడ సైన్యం ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గత నెల 20వ తేదీన పూంచ్ జిల్లాలోని భటా ధూరియన్‌లో ఉగ్రవాదులు అటుగా వెళ్లుతున్న సైనిక శకటంపై గ్రనేడ్ దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం అయ్యి మృతి చెందారు. ఈ దాడికి దిగిన టెర్రరిస్టుల ఉనికి సమాచారం తెలియడంతో శుక్రవారం ఈ గుహ ప్రాంతానికి జవాన్లు వెళ్లినట్లు ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలిసింది. గత నెలలో ఉగ్రవాదుల దాడిని సైన్యం తీవ్రంగా తీసుకుంది.

అప్పటి ఘటనలో సైనికులపై కాల్పులు జరిపి వారిలో ఐదుగురిని చంపివేసిన తరువాత ఉగ్రవాదులు విగతజీవులుగా ఉన్న సైనికుల ఆయుధాలు అపహరించుకుని పారిపొయ్యారు. ఇటీవలి కాలంలో ఇటువంటి దారుణ సంఘటన జమ్మూ కశ్మీర్‌లో జరగలేదు. అయితే ఇప్పుడు పది పదిహేను రోజుల వ్యవధిలోనే మరో ఐదుగురు సైనికులు బలి కావడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైన్యం నుంచి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతూ ఉండటంతో ఇందుకు ప్రతిగా వీరిని ప్రతిఘటించేందుకు ఉగ్రవాదులు యత్నిస్తూ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News