ఎపి హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని విడతలుగా అరెస్టు చేసిన సిబిఐ
మొత్తం 16 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, 13 మంది గుర్తింపు, విదేశాల్లో ముగ్గురు, 11 మంది ఇంటరాగేషన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి నందిగమ్, సురేష్, మాజీ ఎంఎల్‌ఎ ఆమాంచి కృష్ణమోహన్‌రెడ్డిల పాత్రలపై దర్యాప్తు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కించపరిచే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన కేసులో ఐదుగురిని సిబిఐ అరెస్ట్ చేసింది. శనివారం పట్టపు ఆదర్శ్, ఎల్.సాంబశివరెడ్డిలను అరెస్ట్ చేసింది. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్ చేసింది. జులై 9న లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిని కువైట్ నుంచి భారత్‌కు చేరుకోగానే అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు 16మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారిలో 13మందిని గుర్తించామని, మరో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. 11మందిని ప్రశ్నించామని, వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా,మిగతా ఆరుగురిపై చట్టపరమైన చర్యలకు సాక్షాలను సమకూర్చుకోవాల్సి ఉన్నదన్నారు. ఈ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి నందిగం సురేశ్, మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్‌ల పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
జడ్జిలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉన్నట్టు అనుమానిస్తున్నామని సిబిఐ అధికార ప్రతినిధి ఆర్‌సి జోషి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదుకాని అనుమానితులపైనా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తునకు ఎపి హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించాలని సూచించింది. దక్షిణాది రాష్ట్రానికి చెందిన ప్రముఖులు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై ఉద్దేశపూర్వకంగానే ద్వేషాన్ని,అపనమ్మకాన్ని పెంచే పోస్ట్‌లు పెట్టిస్తున్నారన్న అనుమానాలపైనా దర్యాప్తు జరపాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం గమనార్హం.
నిందితుల ఇళ్లలో సిబిఐ జరిపిన సోదాల్లో కుట్రకు సంబంధించిన పత్రాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. నిందితుల్లో ఒకరు మరొకరి పాస్‌పోర్టును వినియోగించినట్టు ఆరోపణలున్నాయి. నిందితులపై సాక్షాల సేకరణకు ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. న్యాయమూర్తులపై దాడులు,దూషణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శుక్రవారం కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు ఫిర్యాదులు చేసినా నిఘా విభాగం ఐబి, సిబిఐ పట్టించుకోవడంలేదన్నారు. న్యాయవ్యవస్థకు సిబిఐ సహకరించడంలేదన్నారు. బాధ్యతతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. న్యాయమూర్తులకు రక్షణ కల్పించడానికి సంబంధించిన సుమోటో కేసులో జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్‌ను ఆటోతో ఢీకొట్టి హత్యగావించిన సంఘటనను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్నది.
Five arrested in case of indecent remarks against judges