Thursday, January 23, 2025

దళిత మహిళపై దాష్టీకం ఘటనలో పోలీసులపై వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: దొంగతనం విచారణలో దళిత మహిళను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో పోలీసులను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. షాద్‌నగర్‌కు చెందిన సునీత అనే మహిళను దొంగతనం కేసులో డిఐ రామిరెడ్డి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. గత నెల 24వ తేదీన తన ఇంట్లో 22.5తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షలు పోయాయని పిఎంపి వైద్యుడు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ఇంటి ఎదురుగా ఉన్న భీమయ్య, సునీత దంపతులను 26వ తేదీన డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ రామిరెడ్డి విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడు. పోలీసులు దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని

మహళపై ఒత్తిడి తేవడమే కాకుండా విపరీతంగా కొట్టారు. మహిళ దుస్తులు విప్పి, షార్ట్‌వేసి మహిళను ఆమె కుమారుడి ఎదుటనే చితకబాదడంతో తీవ్రంగా గాయపడింది. దెబ్బలకు తాళలేక మహిళ స్పృహ తప్పి స్టేషన్‌లోనే పడిపోవడంతో పోలీసుల వాహనంలోనే ఇంటికి పంపించారు. దీనిపై ఒక్కసారిగా విమర్శలు రావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డిఐ రామిరెడ్డిని కమిషనరేట్‌కు అటాచ్డ్ చేసి, ఎసిపి రంగస్వామిని విచారణ చేసి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ చేసిన ఎసిపి సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సమర్పించడంతో డిఐ రామిరెడ్డి, ఐదుగురు కానిస్టేబుళ్లు జాకీర్, అఖిల, మోహన్‌లాల్, రాజు, కరుణాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News