Monday, January 13, 2025

‘ఆదర్శ’ పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

కడుపునొప్పితో పాటు వాంతులు చేసుకొని ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, పెంచికల్‌పహాడ్‌లోని ఆదర్శ బాలిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలం, దుగ్యాల మోడల్ స్కూల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మరువకముందే తాజాగా దేవరకొండ మోడల్ స్కూల్‌లో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అనుష, అనుష, అనన్య, 6వ తరగతి చదువుతున్న మంగ్త, ఉదయ్ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితోపాటు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని 108 వాహనంలో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు.

అయితే, వీరిలో ఇద్దరు జ్వరంతో మరో ముగ్గురు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ మంగ్తనాయక్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఇఒ మాతృనాయక్, తహసీల్దార్ సంతోష్‌కిరణ్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇదిలా ఉండగా వరుస అస్వస్థత సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురై ఇబ్బందులు పడుతున్నా పాఠశాల ఉపాధ్యాయుల నుండి తమకు ఎటువంటి సమాచారం అందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్షం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News