శ్రీనగర్: ఉత్తర కశ్మీరు సరిహద్దు జిల్లా కుప్వారాలో శుక్రవారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కుప్వారాలోని జుమాగండ్ ప్రారంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎదురుకాల్పలలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించారని కశ్మీరు అదనపు పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్(ఎడిజిపి) విజయ్ కుమార్ తెలిపారు. మరణించిన ఆ ఐదుగురు విదేశీ ఉగ్రవాదులను ఇంకా గుర్తించవలసి ఉందని ఆయన చెప్పారు.
ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కశ్మీరులో ఒకే ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాదులు హతమైన సంఘటనలు చాలా తగ్గిపోయాయి. స్ణానికంగా చేరికలు తగ్గిపోవడంతో కశ్మీరు లోయలో క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్య రెండంకలకే పరిమితమైనట్లు పోలీసులు చెబుతున్నారు.