Friday, November 22, 2024

క్రిస్మస్ పండగైనా తగ్గని ఇజ్రాయెల్ దాడుల బీభత్సం

- Advertisement -
- Advertisement -

డెయిర్ అల్ బలా : ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను మరింత ముమ్మరం చేస్తున్నాయి. క్రిస్మస్ పండగైనా సరే వెనక్కు తగ్గడం లేదు. వెస్ట్‌బ్యాంక్ బెత్లెహామ్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండగా, ముట్టడైన భూభాగంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. హమాస్ చెరలో ఉన్న మరో ఐదుగురు బందీలు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను హమాస్‌కు చెందిన సొరంగంలో గుర్తించినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ అయిదు మృతదేహాలను ఇజ్రాయెల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ సొరంగానికి సంబంధించిన వీడియోను కూడా సైన్యం ఎక్స్ లో పోస్ట్ చేసింది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా హమాస్ వద్ద ఇప్పటికీ బందీలుగా ఉన్న 129 మందిని వెంటనే విడిపించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పోప్ ఫ్రాన్సిస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భార్య లేఖ రాయడం గమనార్హం. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి యూదులపై హిట్లర్ జరిపిన మారణ కాండ తరువాత అత్యంత పెద్దదని ఆమె లేఖలో పేర్కొన్నారు.

సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య అధికారులు ఆదివారం వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ సైనికులు గత వారం రోజుల్లో 15 మందివరకు చనిపోయారు. డెయిర్ అల్ బలాకు తూర్పున ఉన్న మఘాజీ శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా మృతిచెందినవారి మృతదేహాలతోపాటు , గాయపడిన వారిని వారి బంధువులు తీసుకురావడాన్ని ఆస్పత్రి సమీపాన ఉన్న పాత్రికేయులు గమనించారు. మృతి చెందిన 68 మందిలో 12 మంది మహిళలు కాగా, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. పొరుగున ఉన్న ఈజిప్టులో అటు ఇజ్రాయెల్ ఇటు పాలస్తీనియన్ల బందీల మార్పిడి ఒప్పందం కోసం తాత్కాలిక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హమాస్ అధీనంలో ఉన్న భూభాగాలను, మిలిటరీ స్థావరాలను స్వాధీనం చేసుకోవాలని, ఇంకా హమాస్ బందీలో ఉన్న 129 మంది బందీలను విడిపించుకోవాలని ఇజ్రాయెల్ గట్టిపట్టుదలతో దాడులు సాగిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు, ఒత్తిళ్లు వస్తున్నా ఇజ్రాయెల్ దాడులు మాత్రం తగ్గడం లేదు.

ఈ యుద్ధం వల్ల ఎక్కువ మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నా తమ లక్షాల కోసం యుద్ధాన్ని కొనసాగించక తప్పడం లేదని, సమీప భవిష్యత్తులో హమాస్ ఉగ్రవాదులు లొంగిపోయే పరిస్థితి కనిపించడం లేదని ఇజ్రాయెల్ మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత అమోస్ హరేల్ ఒక వార్తాపత్రికలో వెల్లడించారు. గాజా లోని బాధితులకు ఎలాంటి సహాయం ప్రస్తుతం సరిగ్గా అందడం లేదు. ఆదివారం గాజాలో 123 సహాయక ట్రక్కులు ప్రవేశించాయని పాలస్తీనియన్ క్రాసింగ్స్ అథారిటీ అధికార ప్రతినిధి వాయెల్ అబూ ఒమర్ వెల్లడించారు. గాజాలో ఆరోగ్య వ్యవస్థ విషాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనామ్ ఆవేదన వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News