Friday, December 20, 2024

పిడుగుల వాన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మరుపులతో పిడుగల వాన కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఐదుమంది ప్రాణాలు కోల్పొయారు ఇందులో ముగ్గురు యువకులు కాగా, మరో ఇద్దరు బాలులు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ఇద్దరి పట్ల మృత్యుపాశంగా మారింది. జిల్లాలోని దిలవార్‌పూర్ మండలంలోని కాల్వ గ్రామనికి చెందిన ప్రవీణ్(26) అనే రైతు గురువారం మధ్యాహ్నం వ్యవసాయానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలో ప్రవీణ్ ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకుని విత్తనాలు చల్లుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై పంటపొలంలోనే కుప్పకూలిపోయాడు.వెంటనే అక్కడున్న స్థానిక రైతులు ఇది గమనించి అతన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ ఉండటం వల్లే పిడుగుపాటుకు గురయ్యాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

అదే సమయంలో ఆ జిల్లాలోని పిడుగుపాటుకు ఓ బాలుడు దుర్మరణం చెందాడు. తానుర్ మండలం ఎల్వత్ గ్రామంలో 13 సంవత్సరాల ఓ బాలుడు మేకలను తీసుకొస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. దీంతో నిర్మల్ జిల్లాలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. సీతానగరంలో పిడుగుపాటుకు బాలుడు మృత్యువాత పడ్డాడు. మేకల విజయ్ సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు సంతోశ్ భద్రాచలం వికలాంగుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులకు ఇంటి వద్ద ఉంటున్న సంతోశ్ సాయంత్రం వేళ గ్రామ శివారులోని మామిడి చెట్టు వద్దకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షంతో పాటు చెట్టుపై పిడుగు పడింది. చెట్టు కింద ఉన్న సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు పిల్లలు స్పృహ తప్పి పడిపోయారు. గత సంవత్సరంలో అనారోగ్యంతో తండ్రి, ఇప్పుడు పిడుగుపాటుకు కుమారుడు మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో అడవిలో కట్టెలు కొడుతుండగా పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మరో రెండు రోజులు భారీ వర్షాలు:
రాష్ట్రంలో రాగల రెండు రోజులు పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ , భద్రాచలం గుండా వెళుతుందని తెలిపింది. రుతుపవనాలు రాగల మూడు నుండి నాలుగు రోజుల్లో కర్ణాటక , తెలంగాణ ,కోస్తాంద్ర లోని మిగిలిన ప్రాంతాల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1కి.మి ఎత్తులో కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచిభారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, బేగంపేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నిమ్స్‌ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి . ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News