మిర్యాలగూడ ః నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి వస్తుండగా, అద్దంకి ,నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చెరుపల్లి మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గ, మోపిదేవి దేవాలయాల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. తిరుగు ప్రయాణంలో పట్టణంలోని నందిపాడు కాలనీకి వస్తుండగా, అద్దంకి, నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై గుర్తు తెలియని లారీ వెనుక నుండి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహేష్ (32) ఆయన భార్య జ్యోతి (30), కుమార్తె రిషిక (6), అతని తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, గొర్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32), అతని కుమారుడు లియాన్సీ (2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. రెండో పట్టణ ఎస్‌ఐ కృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.