Thursday, November 14, 2024

యుపిలో వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు

- Advertisement -
- Advertisement -

Five killed in UP train crash

 

షాజహాన్‌పూర్(యుపి): గేట్లు మూయని లెవల్ క్రాసింగ్‌ను దాటుతున్న వాహనాలపైకి ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మీన్‌పూర్ కత్రా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున సంభవించింది.

లక్నో నుంచి చండీగఢ్ వెళుతున్న సూపర్‌ఫాస్ట్ (5012-డౌన్) రైలు మీరన్‌పూర్ కత్రా రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఉన్న లెవల్ క్రాసింగ్‌ను దాటుతున్న రెండు ట్రక్కులు, ఒక కారు, ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొని పట్టాలు తప్పిందని ఎఎస్‌పి సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పట్టాలు దెబ్బతినడంతో ఆ సెక్షన్‌లో ఆరుగంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తెల్లవారుజాము 5.10 ప్రాంతంలో గేట్లు తెరచి ఉన్న రైల్వే క్రాసింగ్‌ను దాటుతున్న వాహనాలను చూసిన రైలు ఇంజన్ డ్రైవర్ సడన్ బ్రేకులు వేసినప్పటికీ ప్రమాదం జరిగిపోయిందని జిల్లా మెజిస్ట్రేట్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు రైల్వే హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ముగ్గురు ఇంజనీర్లతో కమిటీని నియమించినట్లు డిఆర్‌ఎం తరుణ్ ప్రకాశ్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేవని ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆయన చెప్పారు. ఇలా ఉండగా.. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు లక్నోలో ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News