Monday, December 23, 2024

మహిళా జర్నలిస్టులకు ఆర్ధికసాయం కింద 5 లక్షల రూపాయలిస్తాం

- Advertisement -
- Advertisement -

మిగిలిన అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం
మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం బాగా పనిచేస్తోంది
మహిళా జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని, మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున మహిళా జర్నలిస్టులకు ఆర్థిక సాయం కింద 5 లక్షల రూపాయలను అందిస్తామని రాష్ట్ర మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు హామీ ఇచ్చారు. దీంతోపాటు మహిళా జర్నలిస్టులు ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని మంత్రులు తెలిపారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు బేగంపేట ప్లాజా హోటల్‌లో చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం ప్రారంభోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రులతో పాటు మహిళా కమిషనర్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు ప్రసంగించారు.
2,000 మంది దళిత జర్నలిస్టులు శిక్షణా తరగతులకు….
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులను ఒకచోటుకు తీసుకొచ్చి, శిక్షణ ఇచ్చే ఈ కార్యక్రమం చాలా మంచిదన్నారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు కోసం ఇటీవలే మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా దళిత జర్నలిస్టులు వచ్చారని, 2,000 మంది దళిత జర్నలిస్టులు శిక్షణా తరగతులకు రావడం సంతోషకరమన్నారు. 2,000 మంది దళిత జర్నలిస్టులు వస్తే 400 మంది మాత్రమే మహిళా జర్నలిస్టులున్నారని, మహిళా జర్నలిస్టుల సంఖ్య ఇంకా పెరగాలన్నారు. జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల సంఖ్య పెంచడానికి రిజర్వేషన్ పెట్టాలా? సామర్థ్యం మీదనే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలా అనేది చర్చించాలన్నారు.
మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా మహిళా జర్నలిస్టులకు సన్మానం
ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా మహిళా జర్నలిస్టులను సన్మానం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం ఛానళ్లు పెరిగాయని వాటిల్లో మహిళా జర్నలిస్టులు పెద్ద, పెద్ద నాయకులు, నిపుణులతో చర్చిస్తుంటే ఆసక్తిగా గమనిస్తానని ఆమె తెలిపారు. వారు ధైర్యంగా, గొప్పగా చేసే చర్చలు సంతోషం అనిపిస్తుందన్నారు. పురుషులకు మహిళలు అంటే చిన్న చూపు ఉండొచ్చు కానీ, పురుషులు అంటే మహిళలకు చిన్న చూపు ఉండదన్నారు. సీనియర్ జర్నలిస్టు, కవయిత్రి వాసిరెడ్డి కాశీరత్నం ఇక్కడకు రావడం చాలా సంతోషకరమన్నారు. ఆమెతో తనకు 1985 నుంచి అనుబంధం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా మహిళా జర్నలిస్టులకు అన్ని విధాలా తోడు ఉంటామని ఇంతమంది మహిళా జర్నలిస్టు మేధావులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ గురించి: మంత్రి సబితారెడ్డి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో మీడియా రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా జర్నలిస్టులు అందరూ కలుసుకునే విధంగా మహిళా మీడియా సెంటర్ కోసం ప్రయత్నం చేస్తామన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ గురించి సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. జర్నలిజం అంటే ఆషామాషీ కాదనీ, అయినా ఈ రంగాన్ని ఎంచుకున్న మహిళలకు ఆమె అభినందనలు తెలిపారు. ఉద్యమ కాలంలో, రాష్ట్ర నిర్మాణంలో మహిళా జర్నలిస్టు పాత్ర మరిచిపోలేనిదన్నారు. ఉద్యమ సమయంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆనాడు అరెస్టు చేశారని, రాత్రి రెండు గంటలకు పోలీసు స్టేషన్‌లో పెట్టారు. అప్పుడు నాకు ఆమె ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇప్పుడు చాలామంది వాళ్లు ఏమీ చేశారు అంటున్నారు. ఇలా అనే వారికి వారు చేసినవి కనపడవన్నారు.

వంటింట్లో కత్తిని వృత్తిలో కలాన్ని

మహిళా కమిషనర్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టుల ఒక్క దగ్గర కనపడడం సంతోషంగా, కలర్ ఫుల్ గా ఉందన్నారు. జర్నలిజం వినూత్నమైన రంగమని ప్రజాస్వామ్య రక్షణలో నాలుగవ స్తంభమని ఆమె పేర్కొన్నారు. వంటింట్లో కత్తిని వృత్తిలో కలాన్ని సమపాళ్లలో మహిళలు వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు. వృత్తిపరంగా పని చేసే చోట వేధింపులను అరికట్టే విధంగా మీడియాలో కమిటీలు వేయాలని మీడియా అకాడమీకి ఆమె విజ్ఞప్తి చేశారు.

మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వారి పట్ల వివక్ష: గొంగిడి సునీత

ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మా మహిళా జర్నలిస్టులతో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది శిక్షణ తరగతి కాదనీ, ఇదొక ఉద్యమమన్నారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వారి పట్ల వివక్ష ఉందన్నారు. మహిళా జర్నలిస్టుల ప్రతిభకు తక్కువ లేదనీ, .కానీ అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ మహిళా జర్నలిస్టుల శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమబాల అధ్యక్షత వహించగా, స్వేచ్ఛ సమన్వయకర్తగా వ్యవహారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News