మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన డబ్లూటిసి ఫైనల్ సమరంలో ఓటమి పాలైన విరాట్ కోహ్లి సేనకు త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్ ప్రశ్నగా మారింది. ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపైఎదుర్కొవాలంటే టీమిండియా అసాధారణ ఆటను కనబరచడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై భారత బ్యాట్స్మెన్లకు ఇబ్బందులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కివీస్‌తో పోల్చితే ఇంగ్లండ్‌లో మరింత మెరుగైన బౌలర్లు ఉన్న విషయం తెలిసిందే. వోక్స్, బ్రాడ్, అండర్సన్, మార్క్‌వుడ్ వంటి ప్రపంచ శ్రేణి ఫాస్ట్‌బౌలర్లు ఇంగ్లండ్‌కు అందుబాటులో ఉన్నారు. ఇక సొంత గడ్డపై వీరిని ఎదుర్కొవడం అనుకున్నంత తేలికేం కాదు. ఇటీవల జరిగిన డబ్లూటిసి ఫైనల్లో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయమే.
రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకోక పోవడం భారత బ్యాటింగ్ వైఫల్యానికి నిదర్శనంగా చెప్పాచ్చు. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారో అనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. జట్టుకు అండగా నిలుస్తాడని భావించిన సీనియర్ బ్యాట్స్‌మన్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. కొంతకాలంగా పుజారా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఇది టీమిండియాకు కలవర పరిచే అంశమే. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో అతను మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మన్‌గా పేరున్న కోహ్లి ఇటీవల కాలంలో పెద్దగా రాణించడం లేదు. ఈ సిరీస్‌లో కోహ్లి జట్టుకు చాలా కీలకంగా మారాడు.
అతను రాణించడంపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. ఇక మరో సీనియర్, వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా కివీస్‌తో జరిగిన ఫైనల్లో పెద్దగా రాణించలేదు. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రహానె తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాల్సిన అవసరం జట్టుకు నెలకొంది. ఓపెనర్ రోహిత్ శర్మ, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ల బాధ్యత కూడా మరింత పెరిగింది. వీరిద్దరూ కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో మెరుగ్గా ఆడక తప్పదు.
బౌలర్లు గాడిలో పడాలి..
ఇక ఫైనల్లో బౌలర్లు కూడా విఫలం కావడం ఆందోళనను మరింత పెంచే అంశమే. ముఖ్యంగా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేలవమైన బౌలింగ్‌తో నిరాశ పరిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బుమ్రా ఇటీవల కాలంలో పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. ఈసారైన బుమ్రా తన స్థాయికి తగ్గ బౌలింగ్‌ను కనబరచాల్సి ఉంది. షమి, ఉమేశ్, శార్దూల్ తదితరులు కూడా మెరుగ్గా రాణించక తప్పదు. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయక తప్పదు. అప్పుడే ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే మరోసారి ఘోర పరాజయం ఖాయమనే చెప్పాలి.