ఇంట్లో లభించిన మృతదేహాలు
ప్రయాగ్‌రాజ్/లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి. మృతులలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నవాబ్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖగల్‌పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కాగా..ఈ సంఘటనపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం నేరాలలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అయితే..ఈ సంఘటనపై ప్రయాగ్‌రాజ్ ఎస్‌పి అభిషేక్ అగర్వాల్ వివరణ ఇస్తూ ఆ ఇంటి పెద్దే తన కుటుంబాన్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. రాహుల్(42), ఆయన భార్య ప్రీతి(38), వారి కుమార్తెలు మహి(15), పిహు(13), కుహు(11) మృతదేహాలు వారి ఇంట్లో లభించాయని ఆయన తెలిపారు. చీరతో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని రాహుల్ మృతదేహం లభించగా, ప్రీతి, వారి కుమార్తెల శరీరాలపై పదునైన ఆయుధంతో చేసిన గాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.