పాలమూరు-రంగారెడ్డి పనుల్లో
అపశ్రుతి షార్ట్ సర్కూట్
కారణంగా తెగిన రోప్
మృతులంతా జార్ఖండ్ యువకులు
మన తెలంగాణ/కొల్లాపూర్: కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూరు రేగుమాన్ గడ్డ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మోటర్ల వద్ద కాంక్రీట్ పని నిమిత్తం క్రేన్ సహాయంతో వెళ్తున్న కార్మికులు, క్రేన్ ఐరన్ రోప్ తెగడంతో క్రేన్‌లో ఉన్న 6గురిలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తి గస్తీ పెంచారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మొహరించారు. పాలమూరురంగారెడ్డి మొదటి ప్రాకేజీ లిప్టు వద్ద జరుగుతున్న పనుల్లో భాగంగా మోటర్ల వద్ద కాంక్రీట్ పనుల చేసేందుకు గురువారం రాత్రి 10.30 గంటలకు క్రేన్ సహాయంతో కార్మికులు సొరంగంలోకి వెళ్లారు.
ఆ సమయంలో షాట్ సర్క్యూట్ కావడంతో క్రేన్ రోప్‌లు తెగడంతో క్రేన్‌లో ఉన్న 6గురు కార్మికులు కింద పడడం, వారిపై క్రేన్ పడింది. ఈ ఘటనతో పెద్ద శబ్దం రావడంతో కార్మికులంతా ఉలిక్కిపడ్డారు. ఘటనలో 5గురు కార్మికకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి త్రీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు బోలోనాథ్, శ్రీను, ప్రవీణ్, సోను, కమలేష్‌లుగా గుర్తించారు. వీరంతా జార్కండ్‌కు చెందిన వారు. ప్యాకేజీ-1లో 1200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. వారిలో జార్కండ్, బీహార్, ఒరిస్సాకు చెందిన కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. సంఘటన జరిగిన తరువాత కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిదులు, కార్మికులు ఎవరుకూడా ఈ ప్రాంతంలో లేరు. ఈ మధ్య కాలంలోనే ఈ కాంట్రాక్ట్ పనులు మోఘా కంపెనీ నుంచి నవయుగ సంస్థకు బదలాయింపు జరిగాయి. కాగా, మృతి చెందిన కార్మికుల మృతదేహాలను ఉస్మానియాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, సంఘటనకు కారణమైన యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌డివో, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
కార్మికుల సేప్టీ మరిచిన యాజమాన్యం
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్ట్‌లో జరుగుతున్న పనుల్లో మొదటి నుంచి కార్మికుల భద్రతపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ జూన్ 10న పరిశీలించినప్పుడు కార్మికుల సేప్టీ చర్యలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు, కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. గురువారం జరిగిన సంఘటనతో కార్మికుల భద్రతపై అధికారులు, యాజమాన్యం తీరు పట్ల పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంఘటనపై కేసు నమోదు
జరిగిన ఘటనలో 5గురు కార్మికులు మృతి చెందడం పట్ల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలవెంకటరమణ తెలిపారు. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.