బేకర్స్‌ఫీల్డ్: కాలిఫోర్నియా రాష్ట్రం వాస్కో నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ పోలీస్ డిప్యూటీ అధికారిసహా ఐదుగురు మృతి చెందారు. గృహ హింస కేసులో నిందితుడైన వ్యక్తి ఎకె47 తరహా ఆయుధంతో ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు ప్రారంభించడం ఈ దుర్ఘటనకు కారణమైంది. కాల్పుల శబ్దాలు విన్న ఓ మహిళ ఫిర్యాదుతో పోలీస్ ప్రత్యేక బృందం స్వాత్ అక్కడికి చేరుకున్నది. స్వాత్ బృందం ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించగా నిందితుడు లోపలి నుంచి జరిపిన కాల్పుల్లో ఇద్దరు డిప్యూటీ అధికారులు గాయపడ్డారు.
వారిలో ఒకరు మరణించగా, మరొకరు హాస్పిటల్‌లో చికిత్స అనంతరం కోలుకున్నారని కెర్న్ కౌంటీ పోలీస్ అధికారి డోనీ యంగ్‌బ్లడ్ తెలిపారు. స్వాత్ బృందం జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మృతి చెందాడని ఆ అధికారి తెలిపారు. ఇంట్లో మూడు శవాల్ని గుర్తించారు. నిందితుడి కాల్పుల్లో మృతి చెందినవారిలో ఒకరు అతని భార్య(41) కాగా, ఇద్దరు అతని కుమారులుగా(17,24 ఏళ్లు) గుర్తించారు. నిందితుడిపై గతంలో అతని భార్య ఫిర్యాదు చేయగా జూన్ 3న గృహహింస కేసు నమోదైనట్టు యంగ్‌బ్లడ్ తెలిపారు. ఆ ఇంట్లోకి వెళ్లకుండా నిందితుడిపై ఆంక్షలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి ఈ దుర్ఘటన ప్రారంభమైందని ఆయన తెలిపారు.