హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలోని బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, విజయవాడకు చెందిన చరణ్(26), సంజు(25), గణేష్(25)గా గుర్తించారు. మరో యువకుడు అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన అశోక్ అనే వ్యక్తిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.సదరు యువకులు నిజాంపేట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. నలుగురు యువకులు మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినప్పటికీ వేగం ఎక్కువగా ఉండడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా గుమ్మడిదలలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు.
ఈ సంఘటన గుమ్మడిదల ఎస్‌ఐ విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుమ్మడిదల గ్రామానికి చెందిన బ్రహ్మచారి ఉదయం ఓ శుభకార్యానికి భార్య కల్పన (35), కూతురు శివానీ(4), కుమారుడు కార్తీక్ (2)తో బైక్ వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి 765 దోమడుగు యూటర్న్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ఘటనలో భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కార్తీక్‌కు తీవ్ర గాయాలు కాగా బ్రహ్మచారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రగాయాలకు గురైన బాలుడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున విద్యానగర్ రైల్వే బ్రిడ్జిపై ఓ కారు దూసుకొచ్చింది. అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొంది. అయితే ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించాడు. సంఘటన స్థలంలో అతనికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90 శాతం ఆల్కహాల్ పర్సంటేజ్ నమోదయింది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.