Wednesday, December 25, 2024

ఎపిలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five people were killed in different accidents in AP

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండు బైక్‌లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా కారుకు మంటలు అంటుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే… విశాఖలోని బిఆర్‌టిఎస్ రోడ్‌లో పెద్దగదిలి రోడ్డులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నూతన సంవత్సర వేడుకలలో విశాఖలో రాత్రంతా వీధుల్లో పోలీసులు పహారా కాశారు. కాగా నూతన సంవత్సరం తొలిరోజు వేపగుంట ప్రాంతానికి చెందిన నితీష్, మోహన్ వంశీ ఓ బైక్ పై హనుమంతవాక వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదర్శనగర్ కు చెందిన రాకేష్, రాంబాబు మరో బైక్‌పై హనుమంతవాక నుంచి అడవివరం వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు బిఆర్‌టిఎస్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్ ప్రాంతానికి వచ్చేసరికి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే నితీష్, రాకేష్, రాంబాబు ప్రాణాలు కోల్పోయారు. మోహనవంశీ తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వాహనాల ఆధారంగా నిందితులను గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇదిలావుండగా గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువకుడు కొండేద్దు విజయ మణికంఠ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు అతని బంధువులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వ్యక్తి సజీవదహనం 

ఎపిలోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గోలగముడి రైల్వే గేటు సమీపంలో కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహం గుర్తించలేని విధంగా ఉండటంతో ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేదా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందు ప్రయత్నించారా? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News