న్యూఢిల్లీ: రైల్వే ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చేందుకు నగదు, నగల రూపంలో లంచాలు పుచ్చుకున్న దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఒక డివిజనల్ రైల్వే మేనేజర్(డిఆర్‌ఎం)తోసహా ఐదుగురు రైల్వే అధికారులను సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌ఓ తెలిపారు. వివిధ టెండర్లకు సంబంధించిన పనులకు అనుమతి ఇచ్చేందుకు, బిల్లులను వేగంగా ఆమోదించేందుకు భారీ మొత్తంలో లంచాలు పుచ్చుకున్న గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయానికి చెందిన ఈ అధికారులను జులై 5న సిబిఐ అరెస్టు చేసింది.
అరెస్టయిన వారిలో డిఆర్‌ఎసం వినీత్ సింగ్, డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ కె ప్రదీప్ బాబు, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ యు అక్కిరెడ్డితోపాటు ఇతరులు ఉన్నారు. డిఆర్‌ఎం వినీత్ సింగ్ అవినీతికి సంబంధించి సమాచారం అందుకున్న సిబిఐ అధికారులు నగల జాబితాను తయారుచేసి జులై 4, జులై 5వ తేదీలలో ఆయన నివాసంలో సోదాల ప్రక్రియ ప్రారంభించారు. ఆయన ఇంట్లో ఒక వజ్రాలు పొదిగిన నెక్లస్, వజ్రాలు పొదిగిన జత చెవిదుద్దులను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వస్తువుల గురించి ప్రశ్నించగా వాష్‌బేసిన్ వెనుక దాచినట్లు వినీత్ సింగ్ చెప్పగా మిగతా వస్తువులను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.