Thursday, January 23, 2025

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Five state election results today

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం అధికారికంగా వెలువడుతాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 403 స్థానాలు ఉన్నాయి, తరువాతి క్రమంలో పంజాబ్‌లో 117, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్ 60, గోవా 40 స్థానాలతో ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఫలితాలపై ఎగ్జిట్ పోల్ వెలువడ్డాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 7 వరకూ పలు దశలలో పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో పోటాపోటీగా రాజకీయ పార్టీల నేతలు ప్రచారం సాగించారు. ప్రధానంగా యుపి, పంజాబ్ ఫలితాలు ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటాయనేది ఇప్పుడు కీలకం అయింది. మొత్తం 690 విధాన సభ స్థానాలకు విజేతలు తేలే ఘట్టం ఆసన్నం కావడం, ఈ రాష్ట్రాలలో తదుపరి ప్రభుత్వాల ఏర్పాటు పూర్వరంగానికి ఈ కౌంటింగ్ కీలక ప్రక్రియ అవుతుంది. దేశవ్యాపంగా అన్ని వర్గాలలో ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దృష్టి కేంద్రీకృతం అయింది. ప్రత్యేకించి యుపి అతి పెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ విజేత అయ్యే రాజకీయ పార్టీకి కేంద్రంలో అధికార స్థాపనకు వీలుంటుందనే సంకేతాలతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సులువైన గెలుపు?

ఈసారి ఎన్నికలలో బిజెపి యుపిని తిరిగి గెల్చుకుంటుందని పలు ఎగ్జిట్‌పోల్ ఫలితాలతో వెల్లడైంది. స్థిరమైన ఆధిక్యతను దక్కించుకుంటుందని స్పష్టం అయింది. అయితే బిజెపికి మునుపటితో పోలిస్తే ఈసారి సంఖ్యాబలం తగ్గుతుందని అంచనాలలో వెల్లడైంది. అత్యంత కీలక పరిణామంగా ప్రత్యేకించి కాంగ్రెస్‌కు భారీ షాక్‌గా ఈసారి పంజాబ్‌లో ఆమ్ ఆద్మీపార్టీ అధికారంలోకి వస్తుందని, అది కూడా సజావైన ఆధిక్యత ఉంటుందని సర్వేలలో వెల్లడైంది. దేశ రాజధాని నుంచి పొరుగు రాష్ట్రం పంజాబ్‌కు ఆప్ తన అధికార విస్తరణకు ఈ పంజాబ్ గెలుపు దారితీస్తుంది. బిజెపికి ఉన్న రైతు వ్యతిరేక ముద్ర పంజాబ్ ఫలితంతో మరింత స్పష్టం అవుతుంది. ఇక ఉత్తరాఖండ్, గోవాలలో నువ్వానేనా పందెం పరిస్థితి ఉంటుంది. మణిపూర్ బిజెపి కైవసం అవుతుందని ఎగ్జిట్‌పోల్ సర్వేలతో వెల్లడైంది.

గోవాలో సహజంగానే ఎమ్మెల్యేల వేట సాగుతుందని, ఇప్పుడు బ్యాలెట్ సందడి నుంచి రాజకీయాలు రిసార్ట్ రాజకీయాలకు సాగుతాయని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈసారి బిజెపి అధికార స్థాపన బలం 202ను దాటేస్తుందని పోల్ సర్వేలతో వెల్లడైంది. ఇది నిజం అయితే రాష్ట్రంలో బిజెపి అధికారం నాలుగు దశాబ్దాల రికార్డుకు చేరుతుంది. యోగి ఆదిత్యానాథ్ రెండోసారి అధికారం ఘనత మూటకట్టుకుంటారు. ఈసారి సమాజ్‌వాది పార్టీ ఆర్‌ఎల్‌డి కూటమి బిజెపిని దెబ్బతీసేందుకు సర్వశక్తులూ ప్రయోగించాయి. అయితే ఈ కూటమి అధికారానికి దూరంగా రెండోస్థానానికి పరిమితం అయినా, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని వెల్లడైంది. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఈ రాజకీయ పక్షానికి అత్యధిక ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం అయింది. అయితే అధికార స్థాపనకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగానే నిలుస్తుందని సర్వేలలో వెల్లడైంది.

కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్?

రాహుల్, ప్రియాంక గాంధీలు బలంగానే ప్రచారం సాగించిన యుపిలో ఈసారి కాంగ్రెస్‌కు ఫలితం చేదు అనుభవం మిగులుస్తుందని ఫలితాలతో వెల్లడైంది. కాం గ్రెస్ మూడు నాలుగు అంతకు మించి రావని ఎగ్జిట్‌పోల్ వెలుగులోకి తెచ్చింది.ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు దుష్పలితాలను ఇస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇంతకు ముందు ఎన్నికలలో బిజెపికి 312 స్థానాలు వచ్చాయి. 403 సభ్యుల సభలో ఇది తిరుగులేని రికార్డు అయింది. ఇక కాంగ్రెస్‌తో కూటమిగా రంగంలోకి దిగిన ఎస్‌పికి కేవలం 47 స్థానాలు వచ్చాయి.ఈ విధంగా చూస్తే ఈసారి ఫలితంతో ఎస్‌పి తన బలాన్ని పెంచుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలతో వెల్లడైంది.

కాంగ్రెస్‌పై పంజాబ్ పంజా

ఇంతవరకూ కీలకమైన పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఆప్ రాజకీయ ప్రాబల్యంతో అధికారం కోల్పోతుందని ఎగ్జిట్‌పోల్స్‌తో వెల్లడైంది. ప్రజల మద్దతు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పరిణామాలు, వర్గాలు ఇప్పుడు తగు మూల్యం చెల్లించుకునేలా చేశాయని భావిస్తున్నారు. పలు సర్వేలలో ఆప్ అధికారంలోకి వస్తుందని తేలింది. 2017 ఎన్నికలలో మొత్తం 117 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 77 స్థానాలు దక్కించుకుంది. గత ఎన్నికలలోనే తొలిసారిగా పంజాబ్ రాజకీయాలలో ప్రవేశించిన ఆప్ అప్పడు రెండోస్థానంలో నిలిచింది. 20 స్థానాలు వచ్చాయి. ఇక అకాలీదళ్ బిజెపి కూటమికి కేవలం 18 సీట్లు వచ్చాయి. ఇందులో బిజెపికి వచ్చినవి కేవలం మూడే . ఈసారి కూడా బిజెపికి ఇవే సంఖ్యలో సీట్లు వస్తాయని అంచనాలు వెలువడ్డాయి. అకాలీదళ్ తన పరిస్థితిని కొంత మెరుగుపర్చుకోనుంది.

ఉత్తరాఖండ్‌లో బిజెపికి స్వల్ప ఆధిక్యత

ఉత్తరాఖండ్‌లో ఈసారి అధికారంలో ఉన్న బిజెపికి స్వల్ప ఆధిక్యత లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు వచ్చే వీలుందని కొన్ని సర్వేలతో వెల్లడైంది. గోవాలో కూడా రేస్ తీవ్రంగా ఉంటుందని, ఇతరుల ప్రాబల్యం కోసం బిజెపి పావులు కదపాల్సి ఉంటుందని తేల్చారు. మణిపూర్‌లో బిజెపి అధిక స్థానాలు దక్కించుకుంటుందని, సునాయాసంగా అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్ల పార్టీ అయింది. అయితే 60 స్థానాల అసెంబ్లీలో ఈపార్టీకి 28 సీట్లు వచ్చినా బిజెపికి 21 దక్కినా నాగాపీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్‌పార్టీ ఇతరుల మద్దతుతో బిజెపినే అధికార చేజిక్కించుకుంది. ఈసారి సొంత బలంతో ఇక్కడ అధికారంలోకి వచ్చే వీలుంటుందని కూడా విశ్లేషించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News