అప్పటికి కరోనా సమసిపోతుంది
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర
న్యూఢిల్లీ: 2022లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) తెలిపింది. గోవా,మణిపూర్,పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ముగియనుండగా, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్19 సెకండ్‌వేవ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. వైరస్ విజృంభణ సమయంలో బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించిన అనుభవమున్నదని సుశీల్‌చంద్ర గుర్తు చేశారు. త్వరలోనే మహమ్మారి ప్రభావం సమసిపోతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
అసెంబ్లీల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించి, విజేతల జాబితాలను గవర్నర్లకు అందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దని ఆయన అన్నారు. కరోనా ఉధృతి ఉన్నందున వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికల్ని వాయిదా వేస్తారా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇటీవల కొన్ని రాజ్యసభ ఎన్నికలు, శాసనమండలి సభ్యుల ఎన్నికల్ని వాయిదా వేసిన నేపథ్యంలో మీడియా సంధించిన ప్రశ్నలపై ఆయన వివరణ ఇచ్చారు. గోవా,మణిపూర్,పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీల గడువు 2022 మార్చిలో, ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే నెలలో ముగియనున్నది.