Wednesday, January 15, 2025

24 గంటల వ్యవధి లోనే మూడు చోట్ల కాల్పులు

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధి లోనే మూడు చోట్ల జరిగిన కాల్పుల సంఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఉగ్రవ్యతిరేక ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ జమ్ముకశ్మీర్ పర్యటనకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బారాముల్లా జిల్లా లోని పట్టాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న సమాచారం నిఘా వర్గాల నుంచి అందడంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్‌లు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆపరేషన్ చేపట్టారు. శనివారం తెల్లవారు జామున భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు, ఎదురు కాల్పులు జరిపాయి. ఈ సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ నార్తర్న్ కమాండ్ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. అంతకు ముందు కథువా జిల్లాలో రైజింగ్ స్టార్ కార్ప్ , జమ్ముకశ్మీర్ పోలీస్‌లు ఉగ్రవ్యతిరేక ఆపరేషన్ చేపట్టాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కిష్త్ వాడ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. వారిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారంతో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కిష్తివాడ్, ఉధంపూర్ , పూంచ్, రాజౌరీ జిల్లాలో యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లను మరింత పెంచినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్ 18న తొలివిడత పోలింగ్ జరగనుంది . చీనాబ్ లోయలోని కిష్తివాడ్, రాంబస్, దోడాతోపాటు దక్షిణ కశ్మీర్ జిల్లాల్లోని మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News