మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రికి శుక్రవారం 14 మంది క్షతగాత్రులు వచ్చారని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. వారిలో ఒకరు చనిపోయారని వెల్లడించారు. మిగతా నలుగురికి సర్జరీ జరిగిందన్నారు. ఒకరికి చెస్ట్ దగ్గర బుల్లెట్ గాయమవడంతో మేజర్ సర్జరీ జరిగిందన్నారు. మరొకరికి తొడ భాగంలో గాయమైతే సర్జరీ చేశామని రాజారావు తెలిపారు. మరొకరి కాలికి బుల్లెట్ గాయమవడంతో సర్జరీ జరిగిందన్నారు. చెస్ట్, తొడ వద్ద బుల్లెట్ గాయం అయినవారు కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. మిగతా 9 మందికి సాధారణ గాయాలయ్యాయన్నారు. రాళ్లు, కర్ర దెబ్బలు తగలడం, చర్మం లేవడం వంటి గాయాలయ్యాయన్నారు. 9 మందిని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆ తరవాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరికి లోపలికి అనుమతి ఇస్తున్నామని రాజారావు తెలిపారు.