3 లక్షల మందికి ప్రయోజనం
కోట : రాజస్థాన్ లోని కోటకు చెందిన ఇంజినీర్ సుజీత్ స్వామి తనకు రైల్వే నుంచి రావలసిన రూ.35 రీఫండ్ కోసం ఐదేళ్లు న్యాయ పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. అంతేకాదు, మరో 3 లక్షల మందికి లాభం చేకూర్చిన వాడయ్యాడు. సుజీత్ స్వామి 2017 జులై 2 న గోల్డెన్ టెంపుల్ మెయిల్ ద్వారా ఢిల్లీ వెళ్లడానికి అదే ఏడాది ఏప్రిల్‌లో రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 765. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రయాణాన్ని సుజీత్ రద్దు చేసుకుని టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో రీఫండ్ కింద రూ. 665 జమ అయింది. కానీ నిబంధనల ప్రకారం టికెట్ క్యాన్సిలేషన్‌కు రూ. 65 క్లరికల్ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉండగా, రైల్వే మాత్రం రూ. 35 సర్వీస్ టాక్స్ కలుపుకుని మొత్తం రూ. 100 ఛార్జ్ చేసింది. టికెట్ రద్దు చేసుకున్న సమయానికి జీఎస్‌టి ఇంకా అమల్లోకి రాలేదు. కానీ ప్రయాణ తేధీ జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తరువాత ఉందన్న కారణం చేత రూ. 35 సర్వీస్ ఛార్జి వసూలు చేశారు.
దీనిపై సుజీత్ న్యాయపోరాటం సాగించాడు. లోక్‌అదాలత్‌ను సంప్రదించాడు. ఐఆర్‌సీటీసీకి ఎన్నోసార్లు ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఐఆర్‌సీటీసీ దిగొచ్చింది. సర్వీస్ టాక్స్‌ను రీఫండ్ చేసేందుకు ఒప్పుకుంది. అయితే 2019 మే 1 న రూ. 33 మాత్రమే రీఫండ్ చేసింది. అయినా సుజీత్ ఊరుకోలేదు. ఆ రూ. 2 కోసం మరో మూడేళ్లు పోరాటం సాగించాడు. ఆయన పోరాటం ఫలించింది. గతవారం ఆ రెండు రూపాయలను కూడా ఐఆర్‌సీటీసీ ఆయన ఖాతాలో జమ చేసింది. సుజీత్ లాగే లక్షల మంది నుంచి రైల్వే శాఖ జీఎస్‌టీ అమలు సమయంలో సర్వీస్ టాక్స్ వసూలు చేసింది. వారందరికీ రీఫండ్ చేసేందుకు రైల్వేబోర్డు అంగీకరించినట్టు తమనకు ఐఆర్‌సీటీసీ నుంచి మెయిల్ వచ్చిందని సుజీత్ వెల్లడించారు. మొత్తం 2.98 లక్షల మందికి రూ. 2.43 కోట్లు చెల్లించనున్నామని , త్వరలోనే ఆయా ప్రయాణికులకు వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ఐఆర్‌సీటీసీ అధికారి చెప్పినట్టు సుజీత్ వివరించారు. ఈ ఐదేళ్ల పోరాటంలో తాను విజయం సాధించిన ఆనందంలో పీఎం కేర్స్‌కు సుజీత్ రూ. 535 విరాళంగా ఇచ్చినట్టు వెల్లడించారు.