Wednesday, January 22, 2025

జిఎస్‌టి వచ్చి ఐదేళ్లయినా రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో భారీ తేడాలు

- Advertisement -
- Advertisement -

Five years of GST there is difference in inflation between states

స్థానిక పన్నులు, సప్లై చైన్‌లో లోపాలు.. ఇవే ప్రధాన కారణం
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా కీలకమే

న్యూఢిల్లీ: దేశమంతటికీ వర్తించేలా ఒకే వస్తు, సేవల పన్ను( జిఎస్‌టి)ని అమలు చేసి అయిదేళ్లయినప్పటికీ దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కో రాష్ట్రంలో ఒకో విధంగా ఉండడం విశేషం. స్థానిక పన్నుల్లో తేడాతో పాటు సప్లై చైన్‌లో లోటుపాట్ల కారణంగా వినియోగ వస్తువుల ధరల్లో తేడాలుండడమే దీనికి ప్రధాన కారణం ఉదాహరణకు జూన్ నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జాతీయ సగటు 7 శాతం ఉండగా, తెలంగాణలో అత్యధికంగా 10.5 శాతం ఉంది. బీహార్‌లో అది అతి తక్కువగా 4.7 శాతమే ఉంది. వినియోగదారుల ధరల సూచీ( సిపిఐ) ప్రకారం ఆంధ్రప్రదేశ్, హర్యానాతో పాటుగా పలు రాష్ట్రాలు 8 శాతానికి పైగా ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. జాతీయ సగటుకు పైగా ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రాల్లో అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమయిన జమ్యూ, కశ్మీర్‌లో కూడా ద్రవ్యోల్బణ 7.2 శాతం ఉంది. మరో వైపు జాతీయ సగటుకన్నా తక్కువ ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్నాటక, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లున్నాయి.

తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కేరళలో కూడా ద్రవ్యోల్బణం 6 శాతానికన్నా తక్కువే ఉంది. రవాణా చార్జీల్లో 40నుంచి 60 శాతం డీజిల్ ఖర్చే ఉంటుందని, ఇది నేరుగా వినియోగ వస్తువులపై ప్రభావం చూపిస్తుందని ఖిల భారత సరకు రవాణా వాహన యజమానుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజిందర్ సింగ్ చెప్పారు పండ్లు, కూరగాయలు లాంటి త్వరగా చెడిపోయే సరకులను రవాణా చేసేటప్పుడు వాహనాల యజమానులు రానుపోను చార్జీలు వసూలు చేస్తారని ఆయన చెప్పారు. అయితే చాలా దూరం రవాణాకు ఒకే వైపు చార్జీ వసూలు చేస్తారని ఆయన చెప్పారు. రవాణా ఖర్చును నిర్ణయించడంలో టోల్ చార్జీలు మరో ప్రధాన అడ్డుగా ఉంటుందని, ఎన్ని ఎక్కువ టోల్స్ ఉంటే అంత ఎక్కువ రవాణా చార్జి అవుతుందని కూడా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో స్థానిక పన్నులు ఎక్కువ కారణంగా డీజిల్ చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి.

రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో తేడా ఉండడం సర్వ సాధారణమని, వేర్వేరు ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాతావరణం దీనికి కారణమని పరిశ్రమల సంఘం పిహెచ్‌డిససిసిఐలో ముఖ్య ఆర్థికవేత్త ఎస్‌పి శర్మ అభిప్రాయపడ్డారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోను పట్టణాల్ల్లోకన్నా గ్రామాల ద్రవ్యోల్బణం సాధారణంగా ఎక్కువే ఉంటుందని కూడా ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే సుంకాలు ఒక్కో రాష్ట్రాంలో ఒకో విధంగా ఉండడం వల్ల కూడా కొన్ని రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉండడానికి కారణమని ఆయన అన్నారు. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామీణమార్కెట్ల నుంచి తమ ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన సిబ్బంది ప్రతివారం వ్యక్తిగతంగా సందర్శించి సేకరించిన సమాచారం ఆధారంగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రతినెలా ఈ వినియోగదారుల ధరల సూచీ ( సిపిఐ) డేటాను విడుదల చేస్తుంది.

జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్)పై కూడా ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంటుందని, రాష్ట్రప్రభుత్వ నాయకత్వం, అది అనుసరించే విధానాలపై ఇది ఆధారపడి ఉంటుందని కనీస మద్దతు ధరలు కమిటీలో ఇటీవల సభ్యులుగా నియమితులైన గ్రామీణ భారతం ఎన్‌జిఎల సమాఖ్య( సిఎన్‌ఆర్‌ఐ) సెక్రటరీ జనరల్ బినోద్ ఆనంద్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ( పిడిఎస్) ఎంత సమర్థవంతంగా పని చేస్తుందనేది కూడా ఓ ప్రధాన కారణమని, ఎందుకంటే రాష్ట్రాలుప్రజలకు ఈ వ్యవస్థ ద్వారా పలు సరకులను సరఫరా చేస్తాయని ఆయన చెప్పారు. కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని, ఇది కూడా ద్రవ్యోల్బణంలో తేడాలకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు, ఆహార ధాన్యాలు, పప్పులు, వంటనూనెల ధరలు, రవాణా ఖర్చులు ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అంశాలని, అందకే రాష్ట్రాల మధ్య ద్రవోల్బణంలో తేడాలు సర్వసాధారణం అని బెంగళూరు ఎన్‌ఎంఐఎంఎస్‌లో ఆర్థిక విభాగం సీనియర్ ప్రొఫెసర్ శవఙ శివరామకృష్ణ అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News