Monday, December 23, 2024

కంకరతోనే సరిపెట్టారు

- Advertisement -
- Advertisement -
  • అర్థాంతరంగా నిలిచిన రూ.7.85 కోట్ల పనులు
  • అధ్వానంగా మారిన దండుపేట, సి.కత్తిగూడెం రహదారి
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

చర్ల : రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్లు కుమ్మరిస్తున్నా లక్షం నెరవేరడం లేదు. అధికారుల నిర్లక్షం.. గుత్తేదారుల అలసత్వంతో రోడ్డు నిర్మాణ పనులు ఏళ్లతరబడి సాగుతున్నాయి. నత్తకే నడకలు నేర్పుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలోని రోడ్లు దీన స్థితికి చేరుతున్నాయి. ఫలితంగా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అందుకు నిదర్శనమే చర్ల మండల పరిధిలోని దండుపేట, సి కత్తిగూడెం రహదారి రెండేళ్ల క్రితం పిఆర్ నిధులతో మొదలైన రోడ్డు నిర్మాణ పనులు ఆదిలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.85 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారుడు హడావిడిగా ఉన్న రోడ్డును ఛిద్రం చేసి రెండేళ్ల క్రితం కంకర పోశారు. మళ్లీ నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. అప్పుడు పోసిన కంకర కనుమరుగైపోయిందే తప్ప రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాలేదు. అక్కడక్కడ గుంటలు ఏర్పడి పోసి కంకర పైకితేలి ఆ దారిగుండా ప్రయాణించే వాహనాదారులు, పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు కిందపడి గాయపడిన సందర్భాలు ఉన్నాయని, రాత్రిళ్లు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వాహనాలు తిరుగుతుండడంతో దుమ్ము పొగమంచు మాదిరిగా కమ్మేస్తుడడంతో రాకపోకలు సాగించే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రహదారి నిర్మాణ పనులు చూసి సంతోషపడ్డ ప్రజలకు చివరికి నిరాశే మిగిల్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని అపరిష్కృతంగా ఉన్న రోడ్డు పనులను పూర్తి చేయ్యాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

  • తీవ్ర అవస్థలు పడుతున్నాం

రహదారి నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో ప్రయాణాలు చేయలేకపోతున్నాం. నిత్యం దుమ్ము లేస్తుండడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
– చౌహాన్ కరుణాకర్, కొత్తపల్లి గ్రామస్తుడు

  • దుమ్ముతో అవస్థలు పడుతున్నాం

కంకర పోసి వదిలేయడంతో రెండుమూడు నెలలుగా తీవ్ర అవస్థలు పడుతున్నాం. నిత్యం దుమ్ము లేస్తుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయాలి
– తడికల నరసింహారావు, లింగాపురం, గ్రామస్తుడు

  • వారంలో రోడ్డు నిర్మాణ పనులు చేపడతాం

నిలిచిపోయిన దండుపేట, సి.కత్తిగూడెం బీటీ రోడ్డు నిర్మాణ పనులను వారంలో తిరిగి చేపడతామని, బిల్లుల్లో జాప్యం జరగడంతో గుత్తేదారుడు పనులలు ఆపేశాడు. ఈ వారంలో పనులు ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– వంశి, పిఆర్ ఏఈఈ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News