Wednesday, February 5, 2025

భారత్‌కు చేరుకున్న అక్రమ వలసదారుల విమానం

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ : అగ్ర రాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్ అధ్యక్షుడుగా రెండవ విడత బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కొంత మంది భారతీయులను వెనుకకు పంపిన విషయం విదితమే. సరైన ధ్రువపత్రాలు లేకుండా, చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి అడుగు పెట్టిన భారత పౌరులను అమెరికా ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. దానితో 104 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి17 బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్‌జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

వారిలో 33 మంది పంజాబ్ వారు కాగా, హర్యానా, గుజరాత్ నుంచి 33 మంది వంతున, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ నుంచి ముగ్గురు వంతున, చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారని అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. సి17 విమానంలో 205 మంది అక్రమ వలసదారులు ప్రయాణిస్తున్నట్లు అంతకు ముందు వార్తలు తెలిపాయి. యుఎస్ ప్రభుత్వం వెనుకకు పంపిన అక్రమ భారత వలసదారుల మొదటి బృందం ఇది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, యుఎస్ దేశీయాంగ విభాగం అధికారుల గణాంకాల ప్రకారం, 20407 మంది భారతీయుల వద్ద సరైన ధ్రువపత్రాలు లేనట్లు తేలింది. వారిలో 17940 మందిని వెనుకకు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2467 మంది ఇఆర్‌ఒ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రిమూవల్ ఆపరేషన్స్) నిర్బంధంలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News