Sunday, December 22, 2024

‘గిగ్ వర్కర్ల’కు భద్రత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గిగ్ వర్కర్లకు పూర్తి భద్రత కల్పించాలని,ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్ ముందుకు రావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయలో సంగారెడ్డిలోని ఫ్లిప్‌కార్ట్ పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఆయన వర్చువల్ పద్దతిలో మంగళవారం ప్రారంభించారు. గిగ్ వర్కర్లను బాగా చూసుకోవడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని, ఇ-కామర్స్ కంపెనీలు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) తో చేతులు కలిపి అవసరమైన నైపుణ్యాలతో తక్షణమే ఉపాధి పొందగల శ్రామిక శక్తిని రూపొందించాలన్నారు.

గిగ్ కార్మికుల జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం, ఇ-కామర్స్ కంపెనీలు, మార్కెటింగ్ విక్రేతలు, భాగస్వాముల మధ్య త్రైపాక్షిక ఏర్పాటును కలిగి ఉన్న ఒక నమూనాను ఆయన సూచించారు. దేశంలో తెలంగాణ భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉండటం వల్ల లాజిస్టిక్ హబ్‌గా, సేవలను వ్యాప్తి చేసే హబ్‌గా, దానికి ఆనుకుని ఉన్న ఎనిమిది రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉందని, ఉత్తరం, దక్షిణం మధ్య అనుసంధాన బిందువుగా ఇది ఆదర్శవంతమైన ప్రదేశంగా మారిందని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సేవలను కంపెనీ ఉపయోగించుకుని ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనోపాధి కల్పించాలని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు. అదే విధంగా ఇ-కామర్స్ రంగంలో పనిచేయాలనే యువతలో విశ్వసనీయత, ఆకాంక్షను పెంపొందించాలని ఆ దిశగా ఉపయోగపడే ప్రత్యేక నమూనాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏది చేస్తే దేశం అదే ఫాలో అవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళ స్వయం సహయక బృందాలు విజయవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం…

రాష్ట్రంలో ప్లిప్‌కార్ట్ పెట్టుబడలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్దిక వ్యవస్థ వృద్ది చెందడంతో పాటు వేగవంతంగా మెరుగుపడేందుకు డిజిటలీకరణ అవకాశాలను మెరుగుపరిచి ఈ కామర్స్‌ను మరింత బలోపేతం చేసిందన్నారు. ఫ్లిప్‌కార్ట్ నూతన ఫెసిలిటితో స్థానిక విక్రేతలకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు మెరుగు పడతాయని ఆకాంక్షించారు. స్థానిక కమ్యూనిటీలు ఈ డిజిటల్ విప్లవంలో పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పరోక్షంగా 40 వేల మంది ఉపాధి కల్పన లభిస్తుందని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ప్లిప్ కార్డు పీల్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంస్థ సిఇవో కళ్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం ఈ కామర్స్‌కు వెన్నెముకగా నిలుస్తుందన్నారు.

అంతే కాకుండా చిన్న భారీ వ్యాపార సంస్థలకు సమాన మైన అవకాశాలను సృష్టించడమే కాకుండా లక్షలాది వినియోగదారులకు చేరువ చేసేందుకు ఇది సహయపడుతుందన్నారు. సంగారెడ్డిలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, మరిన్ని అవకాశాలు లభిస్తాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్లిప్‌కార్ట్ పెట్టుబడుల్లో ఆరు పుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గృహోపకరణాలు, ఫర్నీచర్, గ్రోసరీతో సహా లక్షలాది ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 100 డిస్ట్రిబ్యూషన్ హబ్స్‌ను కలిగి ఉండటంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 5 వేల కిరాణ షాపులు ప్లిప్‌కార్ట్ డెలివరీతో భాగస్వామ్యం చేసుకోవడంతో లక్షలాది డెలివరీలను చేయడంతో ఆదాయం వృద్ది చేసుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి ప్రదాన కార్యదర్శి జయేష్ రంజన్ ,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News