Monday, December 23, 2024

ఉత్తరాదిలో వరద బీభత్సం!

- Advertisement -
- Advertisement -

రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్ అత్యధికంగా నష్టపోయింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 31 మంది దుర్మరణం పాలయ్యారు. ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారిని కలుపుకొంటే మృతుల సంఖ్య 37కి చేరింది. ఉత్తరాదిలో వద్దంటే వానలు దక్షిణాదిలోని కొన్ని చోట్ల తీవ్ర వర్షాభావాల విషాద వైరుధ్యం.

హిమాచల్‌ప్రదేశ్ నష్టాన్ని పూడ్చడం ఆ ఒక్క రాష్ట్రానికీ సాధ్యమయ్యేలా అనిపించడం లేదు. మామూలు రోజుల్లోనే అక్కడ కొండ చరియలు తరచూ విరుచుకుపడుతుంటాయి. ఇప్పుడైతే అవి సృష్టించిన విధ్వంసం ఇంత అంత కాదు. కొండ చరియలు, కొండ రాళ్ళు పడిపోయి వందలాది రోడ్లు దెబ్బతిన్నాయి, మూతపడ్డాయి. దానితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మొత్తం 1300 రోడ్లు దెబ్బ తిన్నట్టు సమాచారం. వీటిలో చండీగఢ్ మనాలి రోడ్డు, కల్కా సిమ్లా జాతీయ రహదారి కూడా వున్నాయి. చండీగఢ్ మనాలి రోడ్డు 6 మైళ్ళ పొడవున మూతపడినట్టు తెలుస్తున్నది. వరదల వల్ల కాలు కదపడానికి వీల్లేక నిలబడిపోయిన విహార యాత్రికులను తరలించడానికి హెలికాప్టర్‌ను పంపించాలని వైమానిక దళాన్ని హిమాచల్ ప్రభుత్వం కోరింది.

వరదల ఉధృతికి గోడలు కూలిపోడం, వాహనాలు కొట్టుకుపోడం, కొన్ని చోట్ల భవనాలు కూడా నేలమట్టం కావడం జరిగాయి. హరిద్వార్‌లో ఒక ఇంటి గోడ కూలిపోయి లోపలున్న 2500 డ్రమ్ములు కాలువలో కొట్టుకుపోయాయి. ఢిల్లీలో పై నుంచి వచ్చిన వరద నీటితో యమునా నది పొంగి వీధుల్లోకి ప్రవేశించింది. దానితో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్‌లో వరద ప్రమాదం కొనసాగుతూనే వుంది. ఢిల్లీ, హిమాచల్, యుపిలలో తగ్గు ముఖం పట్టిందని భారత వాతావరణం విభాగం తెలియజేసింది. కులు మనాలి రోడ్డు కిలోమీటరు పొడవున కొట్టుకుపోడంతో యాత్రికులు చిక్కుకుపోయారు. డెహ్రాడూన్ లోని ఆలిండియా వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) లోకి నీరు ప్రవేశించింది. ఈ బీభత్సాన్ని గమనించిన బహుజన సమాజ్ పార్టీ అధినేత, యుపి మాజీ ముఖ్యమంత్రి మాయావతి వెంటనే తగిన సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాలు, వరదలు ఏటా ఈ కాలంలో సంభవించడం సహజమే. కాని నష్టాలను తగ్గించుకోడం కోసం మానవ ప్రయత్నం మరింతగా జరిగి తీరాలి. ఈ విషయంలో తగిన ప్రగతి కనిపించడం లేదు. నదుల ఉగ్ర రూపాన్ని అరికట్టడం కోసం వీలైన చోట్ల ఆనకట్టలను నిర్మించవలసి వుంది. ఒక్కొక్క ఆనకట్ట నిర్మాణం పూర్తి అయి అది అక్కరకు వచ్చే నాటికి ఏళ్ళూ పూళ్లూ పట్టిపోతున్నాయి. వ్యయ భారం దుర్భరమై ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. పేచీలను పరిష్కరించి సత్వర అనుమతులు మంజూరు చేసి ప్రాథమిక అంచనాల్లో తేలిన మేరకు నిధులు సమకూర్చి వాటిని సత్వరమే పూర్తి చేయించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. వరదల్లో మృతుల సంఖ్యను వీలైనంత పరిమితం చేయలేకపోతున్నాము. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఒకటి రెండు రోజుల వ్యవధిలో 31 మంది చనిపోయారంటే మానవ వైఫల్యం ఎంతటిదో తెలుస్తున్నది. అయితే గతం పోలిస్తే వరదల నష్టం తగ్గినట్టే భావించాలి.

1987లో బీహార్‌లో కోసి నది పొంగి పొర్లడం వల్ల సంభవించిన భారీ వరదల్లో 1399 మంది మరణించారు. 68 బిలియన్ రూపాయల నష్టం సంభవించింది. 1988లో పంజాబ్‌లోని నదులన్నీ పొంగి పెద్ద ఎత్తున వరదలు ముంచుకొచ్చాయి. 2018లో కేరళ ఎదుర్కొన్న వర్ష బీభత్సం అసాధారణమైంది. ఆ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 19 వరకు కేరళలో 2346 మి.మీకి మించి వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో పొంగి పొర్లిన నదులపై గల ఆనకట్టల గేట్లు తెరవడం ఆలస్యం కావడంతో ప్రజలు రోజుల తరబడి నడి నీటిలో బతకవలసి వచ్చింది. 2015లో చెన్నైని ముంచ్చెత్తిన వరదల గురించి తెలిసిందే. ఈ వరదల్లో 500 మందికి పైగా మరణించారు. 50,000 ఇళ్ళు దెబ్బతిన్నాయి.

18 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ప్రస్తుత వరదల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు రూ. 785 కోట్ల పైచిలుకు నష్టం సంభవించినట్టు సమాచారం. ప్రకృతి తన పద్ధతిలో తాను కొన్నిసార్లు అత్యంత ప్రసన్నంగానూ, మరి కొన్నిసార్లు భయోత్పాతం కలిగిస్తూనూ జీవజాలంతో ఆడుకొంటూ వుంటుంది. మానవ మేధ పెరిగిన తర్వాత, అనేక ఆధునిక ఉపాయాలు తెలుసుకొన్న మీదట దానికి ముకుతాడు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి గాని అవి పూర్తిగా విజయవంతం కావడం లేదు. ఇటువంటి సందర్భాల్లో పార్టీల పరమైన విభేదాలకు తావు ఇవ్వకుండా కేంద్రం వరదలకు భారీగా నష్టపోయిన రాష్ట్రాలను తక్షణమే ఆదుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News