చెంగ్జూ (దక్షిణ కొరియా) : దక్షిణ కొరియా లో భారీ వర్షాల కారణంగా చెంగ్జూలో నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌ప్యోంగ్ సొరంగం లోకి వరద నీరు అకస్మాత్తుగా ప్రవేశించడంతో 12 కార్లు, బస్సు సహా 15 వాహనాలు చిక్కుకుపోయాయి. శనివారం ఈ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. సమీపం లోని మిహోవ్ నది కట్టలు తెంచుకుని నగరం లోకి ప్రవేశించింది. వరద సొరంగం లోకి చేరడంతో వాహనాల్లో ఉన్నవారు తప్పించుకునే అవకాశం లభించలేదు. సొరంగంలో బస్సు నుంచి ఏడు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో 400 మంది సహాయ బృందాలను ఇక్కడ మోహరించారు. ఈ సొరంగం పొడవు సుమారు 685 మీటర్లు ఉంది. ఇప్పటివరకు పదిమంది ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు చెప్పారు. భారీ పంపులను తీసుకొచ్చి సొరంగంలో నీటిని బయటకు తోడుతున్నారు. దక్షిణ కొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు 26 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఒక్క ఉత్తర జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్ లోనే 16 మరణాలు సంభవించాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. మరిన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
Also Read: ప్రాణాంతక వ్యాధి సెప్సిస్