Thursday, January 23, 2025

ఎన్‌ఎస్‌డిపితో నగర ముంపు సమస్యకు చెక్

- Advertisement -
- Advertisement -

బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్
సిద్దం అవుతున్న ప్రణాళికలు
నగరవాసులపై సమస్యలపై
మంత్రి తలసాని ఉన్నతాధికారులపై సమీక్ష

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. నాలాల వ్వూహాత్మక అభివృద్ది కార్యక్రమం ( ఎన్‌ఎస్‌డిపి) లో భాగంగా హూస్సెన్ సాగర్ నుంచి మూసీవరకు ఉన్న వరద నీటి కాల్వ అభివృద్ది పనులకు ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శ్రీకారం చుట్టగా, అన్ని జోన్లల్లో నాలాల విస్తరణ పనులు ప్రారంభమైయ్యాయి. అదేవిధంగా వర్షం కురిసిన ప్రతి సారి బేగంపేట్ పరసర ప్రాంతంలోని నాలా కారణంగా పలు కాలనీలు బస్తీలు ముంపుకు గురువుతుండడంతో ఈ సమస్యకు సైతం చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. బేగంపేట నాలా కు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరద నీటితో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో ని ప్రజలు వరద ముంపుకు గురి కావడం సర్వసాధారణంగా మారింది.

ఈ పరిసర ప్రాంతాలు ఒక్కసారి ముంపు గురైతే వారం నుంచి 10 రోజుల పాటు నీరు నిలిచి ఉంటుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు గాను ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమం క్రింద ఈ నాలా కు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆయా కాలనీల నుండి స్ట్రాం వాటర్ పైప్ లైన్, సిసి రోడ్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు ఎన్‌ఎస్‌డిపి ప్రాజెక్ట్ అధికారులు, వాటర్ వరక్స్ అధికారులు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నారు. నాలాల విస్తరణతోపాటు నగరంలోని పలు సమస్యలపై పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి జిహెచ్‌ఎంసి , వాటర్ వర్క్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో శుక్రవారం సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్ ఎండి దాన కిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్‌ఎన్‌డిపి ఇంజనీర్ జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ముంపు నుంచి శాశ్వత పరిష్కరం: మంత్రి తలసాని

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (ఎన్‌ఎస్‌డిపి) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. ఇందుకు ఎన్‌ఎస్‌డిపి కింద బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా స్థానికులకు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ, దేవాదాయ భూముల్లో సుదీర్ఘ కాలంగా నివాసం ఉంటూ ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలను అందుకుంటున్న వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

నగరంలో మరిన్ని ప్రాంతాల్లో డబుల్ ఇళ్లు:

ముషీరాబాద్ మండల పరిధిలోని భోలఖ్ పూర్‌లోని సోమప్ప మఠం కు చెందిన స్థలంలో సుమారు 130 నిరుపేద కుటుంబాలు, ఇదే మండలంలోని జీరా కాంపౌండ్ లో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఈ రెండు చోట్ల ఈ జిహెచ్‌ఎంసి ద్వారా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాంగోపాల్ పేట డివిజన్,లోని 134 గృహాల క్రమబద్దీకరణకు సంబంధించిఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అద్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం సానుకూలత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా నగరంలోని గోడే ఖీ ఖబర్, జంగం మెట్, న్యూ బోయగూడ, హైదర్ బస్తీ తదితర 9 ప్రాంతాలలో 485 మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయని, వీటిలో గోడే ఖీ ఖబర్, జంగం మెట్ లోని క్వార్టర్స్ ను తొలగించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని న్యూ బోయగూడ, హైదర్ బస్తీ ప్రాంతాలలోని క్వార్టర్స్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్ శంకర్ స్ట్రీట్, సజన్ లాల్ స్ట్రీట్ నిరుపేదలు జిహెచ్‌ఎంసి స్థలంలో ఇండ్లను నిర్మించుకొని జీవిస్తున్నారని, జిఓ 58, 59 క్రిందవారు దరఖాస్తు చేసుకోవడంతో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్‌లోని వెంగళరావు నగర్, సనత్ నగర్ డివిజన్‌లోని శ్యామల కుంట లలో అనేక నిరుపేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నాయని, రికార్డ్ లో మాత్రం ఎఫ్‌టిఎల్ గా నమోదై ఉందని, ప్రస్తుతం అక్కడ ఎలాంటి చెరువులు, కుంటలు లేనందున పూర్తిస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉపసంఘనికి సమర్పించాల్సిందిగా సికింద్రాబాద్ ఆర్‌డిఎ వసంత ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎంతో చరిత్ర కలిగిన మోండా మార్కెట్, ఓల్డ్ జైల్ ఖానా భవనాలను మోజం జాహీ మార్కెట్ తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణ ను రూపొందించడంతోపాటు మినిస్టర్ రోడ్‌లోని ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం శిధిలావస్థకు చేరిందని, నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లను అక్కడి నుండి తరలించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. సనత్ నగర్ లోని ఇండస్త్రియల్ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణ పనులు, ఫతే నగర్ వంతెన విస్తరణ, రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులను చేపట్టేందుకు రైల్వే, జిహెచ్‌ఎంసిఅధికారులతో కలిసి త్వరలోనే పర్యటించనున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News