Sunday, January 19, 2025

యమున ఒడ్డున రోడ్డున పడ్డ బతుకులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గోనెసంచులు, చిరిగిన దుప్పట్లు, టార్పాలిన్లు పర్చుకుని నింగిలోకి దిగాలుగా చూస్తూ ఢిల్లీలోని పలు మురికివాడల ముతకబతుకుల జనం గడుపుతున్నారు. వందేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో తలెత్తిన యమున పోటు, ఉధృత వరదలతో స్లమ్‌లలో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికీ పనులు చేసుకోవడానికి వెళ్లుదామంటే మురికివాడలు దాటలేని బురద, గుంతలు. అరకొరగా అందుతోన్న ఆహార పొట్లాలు, మరుగు అనేది లేని స్ధితిలో మలవిసర్జన, కాలకృత్యాలు , తాగునీరు లేని దుస్థితితో గడుపుతున్నారు. ఓ వైపు ఢిల్లీలో వరదలపై పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల దుమారాలు చెలరేగుతూ ఉండగా, రెక్కాడితే కానీ డొక్కాడని వాడి పరిస్థితి అగమ్యగోచరం అయింది. మురికివాడల్లోని పలువురి కచ్ఛా , రేకుల షెడ్ల ఇళ్లు యమున వరదలతో నీట మునిగాయి. చాలా వరకూ కొట్టుకుపొయ్యాయి. దీనితో వీరంతా ఇప్పుడు వీధుల పాలయ్యారు. వరదల గురించి తమకు అధికార యంత్రాంగం ముందుగా తెలియచేయలేదని, ఇప్పుడు రోడ్డున పడ్డ తమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని వారు వాపోతున్నారు.

20 ఏండ్ల పాచీ పని కష్టం నీటపాలు
మయూర్ విహార్, యమునా బ్రిడ్జి జనం దైన్యం
ఇప్పటి వరదలతో ఎక్కువగా మయూర్ విహార్, ఓల్డ్ యమునా బ్రిడ్జి ప్రాంతాలోని మురికివాడలు బాగా దెబ్బతిన్నాయి. వరద నీరు తగ్గే వరకూ వీరు వీధుల్లోనే సేదదీరాల్సి వస్తోంది. తాను 20 ఏండ్లుగా పడ్డ కష్టం , ఆ పని ఈ పని చేసి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో కట్టుకున్న ఇల్లు ఇప్పుడు నీటపాలయిందని 39 ఏండ్ల సీమా రోదిస్తూ తెలిపింది. ఆమె ఇన్నేళ్లుగా ఇక్కడ పాచీ పనిచేసుకుంటూ ఇంటిని నెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు తన కాయకష్టాన్ని వరదనీరు నెట్టేసుకుంటూ పోయిందని తెలిపింది. 20 ఏండ్ల శ్రమ మూడురోజుల్లో వృధా అయిందని నీళ్ల మధ్య నిలబడ్డ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సీమా వంటి వారి పరిస్థితి ఈ ప్రాంతాలలో దారుణ రీతిలో కొట్టొచ్చినట్లు ఉంది.

ప్రభుత్వం ఇప్పుడు తమకు టార్పాలిన్లు ఇచ్చింది తప్పిదే ఆదుకున్న పాపాన పోలేదని వాపోయింది. ఓ ప్యాకెట్ పాలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని అన్నారు. శనివారం కొందరు వచ్చి పేర్లు రాసుకుని వెళ్లారని, సాయం అందుతుందనే ఆశైతే తనకు లేదన్నారు. మురికి వాడల వారంటే ఏ సర్కారుకు అయినా ఎందుకో కక్ష. తమకు ఇళ్లు కట్టిస్తామని గొప్పలు చెపుతారు తప్పితే చేసేది ఏమీ లేదని, పైగా సందుదొరికితే తమను వెళ్లగొడుతారని సీమా తెలిపారు. ఇప్పుడు వరదలొచ్చి తమను తరిమికొట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నుంచి యమున నీటి మట్టం తగ్గుతోంది, అయితే మురికివాడల్లో బాధలు ఇనుమడిస్తున్నాయి.

వరద తగ్గితే తిరిగి ఇళ్లకు అప్పటిదాకా ఇంతే సంగతి
మయూర్ విహార్ నివాసి అశోక్ బాధ
తాను యమున ఒడ్డున మయూర్ నివాస్ ప్రాంతంలో 2013 నుంచి ఉంటున్నానని, అప్పట్లో కూడా వరదలు వచ్చాయని ఈ ప్రాంత నివాసి 45 ఏండ్ల అశోక్ తెలిపారు. తమకు అయితే కనీసం పడుకోవడానికి గోనెసంచులు కూడా అందలేదన్నారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఇప్పుడు యమున ఈసారి బ్రిడ్జిని దాదాపుగా తాకుతూ వెళ్లిందని చెప్పారు. మురికివాడలు అన్నీ మునిగాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటిసాయం అందలేదన్నారు. ఇది తమకు తెలిసిన విషయమే అని, వరద తరువాత బురద తగ్గితే తిరిగి తాము ఇళ్ల వద్దకు వెళ్లి వాటిని ఏదో విధంగా నిలబెట్టుకోవల్సి ఉంటుందన్నారు. వారు వీరు వస్తారని, ఏదో సాయం చేస్తారనే ఆశ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News