Saturday, December 21, 2024

క్షణం క్షణం.. భయం భయం

- Advertisement -
- Advertisement -

మేఘం బద్దలయ్యింది.. గంటల కొద్దీ ఏకధారతో ఊర్లు ఊర్లే ఏరులయ్యాయి.. పట్టణాలు చెరువులయ్యాయి. కాలనీలు వరద గుప్పిట చిక్కుకున్నాయి.. సాయం కోసం బిక్కుబిక్కుమంటూ వేలాది మంది ఎదురుచూపు.. వరద నీటి మధ్యలో చిక్కుకుని, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించాలని ఆర్తనాదాలు.. బస్సులపైకి చేరి గుండెలు బాదుకునే వాళ్లు మరికొందరు.. వరద నీటిలో వాహనదారులు కొట్టుకుపోయే దృశ్యాలు.. రోడ్లు తెగి కిలోమీటర్ల కొద్దీ రద్దీ.. వాగులు దాటుతూ పలువురి గల్లంతు.. రైల్వే స్టేషన్లలోనూ వరద తిష్ఠ, రైళ్ల రద్దుతో ప్రయాణికుల పడిగాపులు.. పట్టణాల్లోనూ ఇళ్లలోకి చేరిన వరద నీరుతో జనం అవస్థలు.. కాలనీల్లో కాలు తీసి కాలేద్దామంటే భయం భయం. నాలాల పరిసరాల ప్రజల బాధలు.. ప్రాజెక్టు గేట్ల మొరాయింపు.. ప్రమాదకర స్థాయిలో పరవళ్లు తొక్కే జలాశయాలు..

లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కు.. ప్రమాద హెచ్చరికలు.. వరద బాధితుల కోసం హుటాహుటిన రంగంలోకి హెలికాప్టర్లు, సహాయక సిబ్బంది.. ఫలానా చోట ఆపదలో ఇరుక్కున్న వాళ్ల పరిస్థితి ఏమైంది.. జరగరానిది జరిగితే ఏంటీ..? అన్న ఆందోళన.. ఆరా తీయడం, ఇలా గురువారం పొద్దున నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ఏక్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ.. సర్వత్రా టెన్షన్ వాతావరణం. తెలంగాణ వ్యాప్తంగా వర్షం బీభత్సంతో ఒకరకంగా జల ప్రళయమే కనిపించింది. ఈ జిల్లా.. ఆ జిల్లా.. ఆ పట్టణం.. ఈ నగరం అని లేకుండా కుండపోత వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో వరదల పరిస్థితి, బాధితులకు అందించాల్సిన సాయంపై క్షణక్షణం అధికారులతో సమీక్షించారు.

ముఖ్యంగా హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను కుంభవృష్టి అతలాకుతలం చేసింది. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికారగణాన్ని పురమాయించారు. అధికార యంత్రాంగం కూడా వేగంగా స్పందించి ప్రజలను కాపాడడంలో సఫలీకృతమైంది. వర్షాలు కొనసాగుతుండడంతో విద్యా సంస్థలకు నేడు కూడా సెలవు పొడిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News