మన దేశంలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి. నిన్నమొన్నటి వరకు రుతుపవనాలు కోసం నిరీక్షించి విసిగిపోగా ఇప్పుడు ఎడతెరిపిలేని కుంభవృష్టితో మునిగితేలవలసి వస్తోంది. గత కొన్ని రోజులుగా అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ , హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలు వర్షాల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణనష్టం, ఆస్తుల నష్టం సంభవిస్తోంది. 2019లో రుతుపవనాల వల్ల వచ్చే భారీ వర్షాలు, వరదల కారణంగా దేశం మొత్తం మీద రూ. 57,000 కోట్ల వరకు నష్టం ఏర్పడగా, ఒక్క తమిళనాడులోనే రూ. 26,000 కోట్ల వరకు నష్టం జరిగింది. దాదాపు 13 రాష్ట్రాలు వరద నీటిలో తేలియాడాయి. ఇంత జరిగినా వరద నీటిని మళ్లించి పదిలపర్చుకునే విధానాలు దేశంలో లేకపోవడం పెద్దలోపం. కుంభవృష్టితో రిజర్వాయర్లలో నీరు ప్రమాదస్థాయి దాటిపోతుండడంతో గేట్లు బార్లాతెరిచి వరదనీటిని బయటకు పంపవలసి వస్తోంది. ఆ నీరంతా వృథాగా సముద్రం పాలవుతుందే తప్ప నిల్వ చేసుకోలేకపోతున్నాం.
మళ్లీ వేసవిలో నీటి వనరులు ఎండిపోయి అల్లాడిపోవలసి వస్తోంది. ఇప్పుడు భారీగాచేరుతున్న వరద నీటిని నిల్వచేసుకోలేమా? ఈ మేరకు ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు? అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. దేశం లో నాలుగు మాసాల వ్యవధిలో 80% వర్షపాతం ద్వారా నీరు సమకూరుతుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల సమయంలో చాలా తక్కువ వ్యవధిలో ఎడతెరిపిలేని వర్షపాతం సంభవించి వరదలు ముంచెత్తుకు వస్తున్నాయి. జులై 25 వరకు వరద ప్రవాహం రిజర్వాయర్లలో ఎంత చేరిందో ఎంత బయటకు వృథాగా సముద్రం పాలయిందో పరిశీలిస్తే చాలా వరకు నీటిని ఆదా చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన కలగక మానదు. ఉదాహరణకు గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి భారీగా ప్రవాహం రావడంతో ధవళేశ్వరం నుంచి 13.17 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టవలసి వచ్చింది. 24 వతేదీ వరకు 393 టిఎంసిలు సముద్రం లోకి చేరగా, 25వ తేదీ నాటికి మరో 125 టిఎంసిలు సముద్రం లోకి చేరాయి. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి 18,746 క్యూసెక్కుల నీటిని బయటకు విడిచిపెట్టారు. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం ప్రాజెక్టుల ద్వారా నీటి నిల్వ సామర్ధం 257 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బిఎంసి) నుంచి 325 బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉంటోంది.
సగటు వార్షిక వర్షపాతం 3880 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా పరిగణిస్తే దాదాపు 2000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు వర్షపాతం నీరు నిల్వకాకుండా వృథాగా పోతోంది. దాదాపు 50 ఏళ్ల తరువాత ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో గత మార్చిలో ప్రపంచ నీటి సదస్సులో ప్రాజెక్టుల బలోపేతం పైన, నీటి నిల్వపైన చర్చలు జరిగాయి. నీటి సంరక్షణ, భద్రతపై అమలు చేయాల్సిన కార్యాచరణ పైనా భారత్‌తోపాటు దాదాపు 164 దేశాల ప్రభుత్వాలు ప్రతిపాదనలు సమర్పించాయి. మరి ఈ ప్రతిపాదనలు ఎంతవరకు కార్యాచరణలోకి వస్తాయో ఆలోచించాల్సిందే. భారీ వర్షాల వల్ల ముంచుకొచ్చిన వరద నీటిని క్రమబద్ధీకరించి నిల్వ చేసుకునే ఏర్పాట్లు లోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘నీటిని పదిలపరుచు సద్వినియోగించు’ అనే లక్షాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించక తప్పదు. వర్షాలు, వరదల వల్ల తీర మైదానాలు రీఛార్జి అవుతుంటాయి. అలా రీఛార్జి అయ్యే నీటి కన్నా ఎక్కువగా తోడేస్తే అవి మురికి నీళ్లుగా మారతాయి.
అత్యంత విలువైన జలసిరి నశించక తప్పదు. నగరాలు, పట్టణాల్లో, పరిశ్రమల్లో వ్యవసాయంలో అవసరాలకు మించి నీటిని విచక్షణారహితంగా తోడేయడంతో నదులు ప్రవాహం తగ్గి క్షీణిస్తున్నాయి. ఉదాహరణకు తమిళనాడులోని తమిళ బరణి నది తిరునల్వేలి, తూతుకుడి, నగరాల మీదుగా 100 కిమీ పొడవునా ప్రవహిస్తోంది. ఈ రెండు నగరాల జనాభా మిలియన్‌కు పైగా ఉంటుంది. రోజుకు ఒక్కొక్కరికి తలసరి 100 లీటర్ల నీరు అవసరం అవుతుంది. నది ఒడ్డున కట్టడాల ప్రాంతాన్ని మినహాయిస్తే 75 కిమీ వరకే నది ప్రవహిస్తోంది. నదికి రెండు వైపులా కిలోమీటరు పరిధిలో స్వచ్ఛమైన నీటిని పదిలం చేయవచ్చు.ఈ నదీ ప్రవాహప్రాంతం (75కిమీ) 50% వరకు వాన నీటిని గ్రహిస్తుంది. అంటే ఏటా 100 సెం.మీ వంతున వర్షపాతాన్ని గ్రహిస్తుందని చెప్పవచ్చు. రుతుపవనాల సమయంలో వరదకు నీటిమట్టం 4 మీటర్ల వరకు పెరిగి ప్రవాహ ప్రాంత మైదానంలో 3 మీటర్ల లోతున నీరు ఇంకుతుంది. దీని వల్ల 15 నుంచి 50% పరిమాణంలో నీటి లభ్యత చేకూరుతుంది. ఈ విధంగా పట్టణ అవసరాలకు ఈ నీరే ఉపయోగపడుతుంది. కానీ ప్రవాహమైదానంలో కట్టడాలు అక్రమంగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి.