శ్రీశైలంలో 822అడుగులకు నీటిమట్టం
శ్రీరాంసాగర్‌కు 19420 క్యూసెక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనాలతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించు కుంటున్నాయి. గోదావరిలో కూడా నీటి ప్రవాహం మెరుగు పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం ఈ జలాశయంలోకి 19420 క్యూ సెక్కుల నీరు చేరుతుండగా, జలాశయంలో నీటి నిలువ 26.31టిఎంసిలకు చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి కూడా 23369 క్యూసెక్కుల నీరు చేరుకుంటుండగా, జలాశయం నుంచి బయటకు 18515క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వాహకంగా రాష్ట్రంలోని మిగిలిన జలాశయాల్లో నీటినిలువలు ఆశాజనకంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉస్మాన్ సాగర్ జలాశయంలో గత ఏడాది ఇదే సమయానికి 0.020టిఎంసిలు ఉండగా ,ప్రస్తుతం ఈ జలాశయంలో 2.332టిఎంసిల నీరు నిలువ ఉంది. హిమయత్ సాగర్ జలాశయంలో గత ఏడాది 0.392 టిఎంసిలుండగా, ప్రస్తుతం ఇందులో 2.115 టిఎంసిల నీరు నిలువ ఉంది. సింగూరు జలాశయంలో గత ఏడాది 0.392టిఎంసిలు ఉండగా, ప్రస్తుతం ఈ జలాశయంలో 17.203టిఎంసిలు నిలువ ఉంది. మంజీరా జలాశయంలో గత ఏడాది పెద్దగా నిలువలేవి లేకపోగా ప్రస్తుతం మంజీరాలో 0.393టిఎంసిల నీరు నిలువ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
నిలకడగా కృష్ణమ్మ:
ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలొ వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఆల్మట్టిలోకి ఇన్‌ఫ్లోస్ 20451క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. జలాశయంలో నీటి నిలువ 93.42టిఎంసిలకు పెరిగింది.దిగువన నారాయణపూర్ జలాశయంలోకి 23778క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 25,215వేలక్యూసెక్కుల నీటిని బయటకు వదులు తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి వరద ప్రవాహం 3895క్యూసెక్కులు ఉండగా, జలాశయంలో నీటినిలువ 32.46టిఎంసిలకు చేరుకుంది. జూరాల జలాశయంలోకి ఎగువనుంచి 29వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తితోపాటు ఎత్తిపోతల పధకాలకు 25వేలక్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ జలాశయంలో 7.39టిఎంసిల నీరు నిలువ ఉంది.
శ్రీశైలంలో మెరుగుపడుతున్న నీటిమట్టం:
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమేపి మెరుగుపడుతూ వస్తోంది. ఎగువన సుంకేసుల నుంచి తుంగభద్ర జలాలు, ఇటు జూరాల నుంచి కృష్ణాజలాలు కలిపి శ్రీశైలం జలాశయంలోకి 33వేలక్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఈ జలాశయం నుంచి 26839క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటిమట్టం 822.70అడుగుల స్థాయిలొ ఉండగా, నీటి నిలువ 42.87టిఎంసిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ జలాశయలోకి ఎగువనుంచి 14095 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఈ జలాశయం నుంచి 4845క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో నీటిమట్టం 534అడుగుల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ఇందులో నీటినిలువ 176టిఎంసిలు ఉంది. దిగువన పులిచింతల జలాశయంలోకి ఇన్‌ఫ్లో 2177క్యూసెక్కులుండగా, ఔట్‌ఫ్లో 600క్యూసెక్కులుంది. జలాశయంలో 16టిఎంసిల నీరు నిలువ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Flood water flow into Sriram Sagar Project