సామర్థ్ధానికి మించి లక్షాలు నిర్దేశం, ఈ ఖరీఫ్‌లో 25లక్షల ఎకరాలకు సాగు
18లక్షల ఎకరాలే లక్షంగా ప్రాజెక్టు డిజైన్, ప్రాణహితకు వచ్చే వరదనీటిని ఒడిసిపట్టాలి
రోజువారీ అంచనాకు పకడ్బందీ ఏర్పాట్లు, జలాశయాలు, కాల్వలు రెడీ పక్కా ప్రణాళితో వరద నియంత్రణ
మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీ జలాలను పల్లెపల్లెకూ ప్రవహింపజేసి ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో సాగునీటి కొరత సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికతో వరదనీటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వానాకాలం పంటల సాగుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రికార్డుస్థాయిలో 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొంది. ఎగువ గోదావరి నుం చి, ప్రాణహిత నది నుంచి వచ్చి గోదావరిలో కలిసే వరదనీటిని మొత్తాన్ని ఒడిసిపట్టుకొని కాళేశ్వరం జలాశయంలో నీటిని నింపుకొని అక్కడి నుంచి ఇతర ప్రధాన జలాశయాలకు నీటిని తరలించగలిగితే 25 లక్షల ఎకరాలకు విజయవంతంగా సాగునీటిని అందించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగినట్లుగా కొత్తగా నిర్మించిన జలాశయాలు, కా ల్వలు, పంపుసెట్లు, మోటార్లు, పైప్‌లైన్లలను పూర్తిస్థాయిలో సిద్ధ్దం నీటి శాఖాధికారులు వివరించారు. వాస్తవానికి తెలంగాణలోని 13 జిల్లాల్లోని 18 లక్షల 25వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చే సేందుకు వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టును డి జైన్ చేసిన ప్రభుత్వం సామర్దానికి మించి ఏకంగా 25 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని లక్షంగా పెట్టుకోవడమంటే ఒకరకంగా సాసోపేతమైన చర్యేనని ఆ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా గోదావరి నది నుంచి మొత్తం 240 టిఎంసిల నీటిని సద్వినియో గం చేసుకోవడానికి వీలుంది. నదిలోకి వచ్చి న వరదనీటిని ఎప్పటికప్పుడు కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, లోయర్ మానేరు డ్యాం (ఎల్.ఎం.డి), ఎల్లంపల్లి, నిజాంసాగర్‌ల జలాశయాలను నింపుకుంటూ వరదనీరు వృథా కాకుండా పక్కా వ్యూహంతో జలాశయాల నిర్వహణను చేపట్టడం మూలంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలనే ప్రభుత్వ లక్షాలను నెరవేర్చినట్లవుతుందని ఆ ఇంజనీరింగ్ అధికారులు ధీమాగా చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసిందే 18.25 లక్షల ఎకరాలకు కదా… మరి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా ఇస్తారని ఎవ్వరికైనా అనుమానం వస్తుందని, అందుకే అలాంటి అనుమానాలను పటాపంచలు చేసేందుకే వరదనీటి నియంత్రణ, జలాశయాల్లో నీటిమట్టాల నిర్వహణ, కాల్వల నుంచి సాగునీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాలన్నీ ఏకకాలంలో జరిగిపోతుంటాయని వివరించారు. అయితే ఈ పనులన్నీ ఏక కాలంలో జరగాలంటే నీటిపారుదల శాఖలోని కిందిస్థాయిలోని లష్కర్ల దగ్గర్నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్, ఇంజినీర్ స్థాయి అధికారులతో పాటు యావత్తు నీటిపారుదల శాఖ యంత్రాంగం మొత్తం ఫీల్డ్‌లోనే ఉండాల్సి ఉంటుందని, ఏ స్థాయి అధికారి అయినా ఒక్కరోజు ఏమరపాటుగా ఉన్నా వరదనీటి అంచనాలు మారిపోతాయని, అందరం అప్రమత్తంగా ఉంటేనే సమర్ధవంతమైన జలాశయాల నిర్వహణ జరుగుతుందని వివరించారు. గోదావరి నదిపైన, జలాశయాల డ్యాంలపై, ప్రధాన కాల్వలు, పంపులు, మోటార్లు, విద్యుత్తు సబ్-స్టేషన్ల వద్ద అన్ని హోదాల్లోని ఇంజినీర్లు రేయింబవళ్లూ కష్టపడి పనిచేస్తేనే ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా గోదావరి జలాలను పల్లెపల్లెకూ తరలించి 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్షాన్ని సాధించడానికి వీలవుతుందని అంటున్నారు. అందుకు తగినట్లుగా భారత వాతావరణ శాఖాధికారులతో ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలపై బులిటెన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నామని, దాంతో గోదావరి నదికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎంతెంత వర్షపాతం నమోదవుతుందని, ఉప ఎంతెంత వరదనీరు వస్తుందని, ఆ వరదంతా గోదావరినదిలోకి వచ్చేసరికి ఎంత ఉంటుందనే అంశాలను ఏరోజుకు ఆ రోజు లెక్కలు వేసుకునేంటేనే వరదనీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని ఆ అధికారులు వివరించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నామని, అందుకు జలసౌధలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నామన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షాలు, వరదల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సాంకేతిక సహకారం కూడా తీసుకొంటున్నామని, ఇలా అన్ని కోణాల్లో సమాయత్తం కావడంతోనే కాళేశ్వరం నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించి రికార్డు సృష్టించాలని లక్షంగా పెట్టుకొన్నామని ఆ అధికారులు వివరించారు.
Flood water inflow into Kaleshwaram Project