శరవేగంగా నిండుతున్న శ్రీరాంసాగర్
తెరుచుకున్న మూసి గేట్లు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నదీ పరివాహకంగా ఉన్న పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువనుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఈ ప్రాజెక్టులోకి 131,385 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటి నిలువ 53.5టిఎంసిలకు పెరిగింది. కడెం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిపోవటంతో ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 24408 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ముందు జాగ్రత్తకింద అధికారులు ఈ ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తివేశారు. జలాశ యం నుంచి 16685 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలో నీటినిలువ పూర్తి స్థాయికి చేరువలో ఉంది. ప్రస్తుతం ఇందులో 18.45టిఎంసిల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టులోకి చేరుతున్న నీటి ప్రవాహాలను నిరంతరంగా పర్యవేక్షిస్తున్నా రు. ప్రాజెక్టుకు దిగువన ఉన్న గోదావరి పరివాహక ప్రాం తాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నదీతీరం వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జూరీ చేశారు. ప్రతిగంటకోసారి సైరన్ మోగిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కాళేశ్వరం జలాశయం వరదనీటితో తొణుకులు కొడుతోంది. అన్నారం ఆనకట్ట 5గేట్లు ఎత్తివేశారు. ఈ బ్యారేజి నీటి సామర్ధం 10టిఎంసిలుకాగా ఇప్పటికే పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో గేట్లు ఎత్తివేసి దిగువకు 4500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరో వైపు గోదావరితోపాటు ప్రాణహిత నదుల నుంచి 96630 క్యూసెక్కులనీరు చేరుతుండటంతో మేడిగడ్డ బ్యారేజ్ 24గేట్లు ఎత్తివేశారు. మేడిగడ్డలో ప్రస్తుతం 13టిఎంసిల నీరు నిలువ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
మీడియం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలుమీడియం ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది.కొమరం భీం ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువకావటంతో కొంతమేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తన్నట్టు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 1183అడుగులు కాగా, ఇప్పటికే నీటిమట్టం 1182అడుగులకు చేరింది. స్వర్ణవాగు దిగువన పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాలిపేరు జలాశయంలోకి కూడా 8720క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు 9గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీరా నదిలో కూడా వరదప్రవాహకం పెరిగింది. ఎగువ నుంచి సింగూరు జలాశయంలోకి 2423క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 386క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసినదికి వరద ప్రవాహం పెరిగింది. మూసి ప్రాజెక్టులోకి 4000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 4గేట్లు కొద్దిమేరకు ఎత్తి 2000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Flood water inflow into Sriram Sagar Project