హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థపై పడింది. భారీ వర్షాల నేపథ్యంలో హసన్‌పర్తి, కాజీపేట రైల్వే ట్రాక్‌లతో పాటు మరిన్ని రైల్వే ట్రాక్‌లపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
ఇప్పటికే మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే మరికొన్నింటిని కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 9 రైళ్లను దారి మళ్లీంచినట్లు తెలిపింది. ఇందులో సిర్పూర్ కాగజ్‌నగర్ – టు సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ -టు సిర్పూర్ కాగజ్‌నగర్ (17233)తో పాటు సిర్పూర్ కాగజ్ నగర్ -టు సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాలో
పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాలో తిరుపతి -టు కరీంనగర్ (12761), కరీంనగర్ – టు తిరుపతి (12762), సికింద్రాబాద్ -టు సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ – టు సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. వర్షాలు ఇలానే మరో రెండు రోజులు కొనసాగితే మరిన్ని రైళ్లు రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పెద్దపల్లిలో నిలిచిపోయిన గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్
గురువారం ఉదయం గోరక్‌పూర్ టు- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పెద్దపల్లిలో నిలిచిపోయింది. పట్టాలపై పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో ముందుజాగ్రత్తగా చర్యగా రైలును అధికారులు నిలిపివేశారు. ఈ రైలు గోరక్‌పూర్ నుంచి సికింద్రాబాద్ రావాల్సి ఉండగా అధికారులు ప్రయాణిలకును రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు.