వణికిన భాగ్యనగరం
హైదరాబాద్: మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతోభాగ్యనగరం వణికిపోయింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌తో పాటు , హుస్సేన్‌సాగర్‌ల నుంచి మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో వరద పోటెత్తుతోంది. ఈ మూడు జలాశయాల నుంచి దాదాపుగా మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసినదిలో గత 100 ఏళ్ల నాటి వరదను తలపిస్తూ పూర్తిగా నిండుగా ప్రవహిస్తోంది. వరద ఉదృతితో మూసి పరివాహక ప్రాంతాల్లోని వందలాది కాలనీలు బస్తీలు జల దిగ్భందనంలో చిక్కుకున్నాయి. మరో వైపు మూసినదిపై ఉన్న బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ఉప్పొగడంతో అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.. మూసీ నది పూర్తిగా ఉగ్ర రూపం దాల్చడంతో అధికారులు మంగళవారం సాయంత్రమే హై అల్డర్‌ను ప్రకటించారు. పరివాహక పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా ముందస్తూ చర్యల్లో భాగంగా మూసారంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలను అధికారులు పూర్తిగా మూసివేశారు.
మూసారం భాగ్ బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో బ్రిడ్జికు రెండు వైపుల మంగళవారం సాయంత్రంమే పోలీసులు భారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో గత రెండు రోజులుగా మూసారాంబాగ్, అంబర్‌పేట్, దిల్‌సుఖ్ నగర్ కోఠి మార్గాల్లో ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. బుధవారంఉదయం నుంచి 11 గంటల వరకు అంబర్ పేట్ , మూసారాంబాగ్, మలక్‌పేట్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తి నిలిచిపోయ్యాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేయడంతో అంబర్‌పేట కొత్త బ్రిడ్జి మీదగా వాహనాలు వెళ్లాయి. అయితే మూసారంబాగ్, మలక్‌పేట్ రెండు వైపుల నుంచి వాహనాలు భారీగా రావడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి గంటల తరబడి ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఉదయం వేళా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కూడ ఇదే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నగరవాసులు ఎక్కడికక్కడ ప్రత్యాన్మా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నించడంలో అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరింత ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరద ఉదృత్తి మరింత పెరగడంతో మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జిహెచ్‌ఎంసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. జియాగూడ, మూసానగర్, శంకర్ నగర్, కమలానగర్, మూసారాంబాగ్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లోని కాలనీలు బస్తీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 1400 మందికి 30 సెంటర్లలో పునరావాసం కల్పించారు. వీరందరికీ హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా వీరందరికి భోజన వసతులను కల్పించారు.
మూసీలోకి భారీగా వరద నీరు
జంట జలాశయాలలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఈ రెండు జలాశయాలకు పై నుంచి వరద పొటెత్తుతోంది. దీంతో అధికారులు ఈ రెండు జలాశయాల నుంచి సుమారు 18,981 క్యూసెక్కుల వరద నీటిని మూసిలోకి వదలు తున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ నుంచి సైతం మరో 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసిలోకి వచ్చి చేరుతోంది. దీంతో సుమారు 20,770 క్యూసెక్కుల వరద నీరు మూసిలోకి వచ్చి చేరుతుండడం, నగరంలోని పలు ప్రాంతాల్లో మూసీనది కూచ్చించుకుపోవడంతో వరద నీరు సాఫీగా వెళ్లలేక పరిసర ప్రాంతాలను ముంచెత్తుతూ ముందుకు సాగుతోంది. జియాగూడ వద్ద రోడ్డుకు సమాంతరంగా వరద ఉదృతి కొనసాగుతుండడంతో ఇరు వైపుల పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు పూర్తిగా నీటమునిగాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్ నుంచి 13 గేట్లను 6 పీట్ల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు, వరద నీరు మూసిలోకి వదులు తున్నారు అదేవిధంగా హిమాయత్‌సాగర్ నుంచి 8 గేట్ల ద్వారా4 పీట్ల మేర ఎత్తి 10,700 క్యూసెక్కులు వదలగా సాయంత్రానికి 8 గేట్లను 3 పీట్ల మేర ఎత్తి 7708 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదిలారు. అదేవిధంగా , హుస్సేన్‌సాగర్ నుంచి సైతం 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ నుంచి 8 గేట్ల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.
బుధవారం పలు ప్రాంతాల్లో వర్షం
బుధవారం సైతం నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గాజుల రామారం, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, బాలానగర్, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమల్‌గిరి, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ , మెహిదిపట్నం, నాంపల్లి, కోఠి, అబిడ్స్ హిమాయత్‌నగర్, నారాయణగూడ, అంబర్‌పేట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్‌బినగర్, నాగోల్ ఉప్పల్ రామాంతాపూర్, హబ్సిగూడ. నాచారం, తార్నాక, లాలాపేట్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.