Wednesday, November 20, 2024

ప్రాజెక్టులకు వరద

- Advertisement -
- Advertisement -

Flooding for projects with heavy rains

భారీ వర్షాలతో పొంగుతున్న కృష్ణ, గోదావరి, శ్రీరాంసాగర్ 11 గేట్లు, లోయర్ మానేరు 16 గేట్లు, తాలిపేరు 5 గేట్లు ఎత్తివేత, ఎల్లంపల్లికి వరద, పెరిగిన మంజీర మట్టం, జూరాలకు 25200 క్యూసెక్కులు, శ్రీశైలంకు 31755 క్యూసెక్కుల వరద, మూసీకి వరద ప్రవాహం

మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన పరివాహక ప్రాంతాల్లో కురుస్తు భారీ వర్షాలతో కృష్ణా,గోదావరి నదుల్లో వరద నీటి ప్రవాహాలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. మహారాష్ట్రలో ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుకుంటోంది. ఈ ప్రాజెక్టులో నీటినిలువ 90.31టిఎంసిల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి 37444క్యూసెక్కుల నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 11గేట్లు ఎత్తివేశారు. జలాశయం నుంచి 44,940క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఇందులో కాకతీయ కాల్వకు 2500క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800క్యూసెక్కులు ,మిషన్ భగీరధకు 150క్యూసెక్కలు నీటిని విడుదల చేస్తున్నారు.గోదావరి నది పరివాహకంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుకుంటోంది.

ఎల్లంపల్లికి పోటేత్తిన వరద:

ఎగువనుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 20.18టిఎంసిలు కాగా ఇప్పటికే ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరటంతో నిండుకుండను తలపిస్తోంది. ఎగువనుంచి 78,732క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు భద్రతా చర్యలను దృష్టిలో వుంచుకుని వరదనీటి నియంత్రణ చర్యల్లో భాగంగా గేట్లు ఎత్తివేసి 86,454క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి బయటకు విడుదల చేస్తున్నారు.

దిగువ మానేరుకు భారీ వరద:

దిగువ మానేరు ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు చేరుతోంది. ఎగువన మిడ్ మానేరు ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువనుంచి 7376క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ గరిష్టస్థాయికి చేరువ కావటంతో రిజర్వాయర్ నుంచి అంతకు రెట్టింపుగా 14042క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువ మానేరు ప్రాజెక్టులోకి 46,801క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. ప్రాజెక్టులో 24.07టిఎంసిల గరీష్టస్థాయి నీటినిలువకు గాను ,ఇప్పటికే 22.58క్కూసెక్కుల నీరు నిలువ ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న 46,801క్యూసెక్కుల నీటిని వస్తున్నది వస్తున్నట్టే రిజర్వాయర్ నుంచి బయటకు విడుదల చేస్తున్నారు.

మంజీరాలో పెరిగిన వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నదిలో వదనీరు ఉరకలేస్తోంది. సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుకుంటోంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 29.91టిఎంసిలు కాగా, ఇప్పటిక 25.57టిఎంసిల నీరు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 14,479క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కూడ వరద ప్రవాహకం పెరిగింది. ఎగువ నుంచి ఈ ప్రాజెక్టులోకి 22490క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 17.80టిఎంసిలు కాగా , ఇప్పటికే ఈప్రాజెక్టులో 12.74టిఎంసిల నీరు నిలువ ఉంది.

తాలిపేరు 5గేట్లు ఎత్తివేత

చత్తిస్‌గడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చింతవాగు, రోటెంత వాగుల్లో వరద ఉధృతి పెరిగింది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటేత్తటంతో ప్రాజెక్టు 5గేట్లు ఎత్తివేసి దిగువకు 6593క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.దీంతో దిగువన పగిడివాగులో వరద ఉధృతి పెరిగింది. కండె ప్రాజెక్టులోకి కూడా 2732క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో 7.60టిఎంసిల పూర్తి స్థాయి నీటినిలువకు గాను 6.70టింఎంసిల నీరు నిలువ ఉంచి దిగువకు 4421క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కృష్ణాలో పెరిగిన వరద.. జూరాలకు 25200క్యూసెక్కులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం మళ్లీ పుంజుకుంది. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టులోకి 25200క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్తాయికి చేరువలో ఉండటంతో 30,408క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంకు 31755క్యూసెక్కుల వరద:

శ్రీశైలం జలాశయంలోకి ఎగువనుంచి 31,755క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. ప్రాజెక్టులో 885 అడుగుల గరిష్ట స్థాయి నీటిమట్టానికిగాను 872.90అడుగులకు చేరింది. జలాశయంలో 154.18టిఎంసిల నీరు నిలువ ఉంది. జలాశయం నుంచి 23,626క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు 14,844క్యూసెక్కులు

ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 14,844క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది.ప్రాజెక్టులో 590అడుగుల గరిష్ట స్థాయి నీటిమట్టానికి గాను 587.80అడుగులకు చేరింది. నీటినిలువ 305.90టిఎంసిలు ఉండగా , జలాశయం నుంచి 14844క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి 15,703క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 23404క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మూసికి వరదపోటు

పరివాహకప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలతో మూసినదిలో వరద ప్రవాహం భారీగా పెరిగుతోంది. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసినదిలో వరద ఉధృతి పెరిగింది. ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ జలాశయాల్లో నీటినిలువ గరిష్టస్థాయికి చేరటంతో ఈ రెండు ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసి ప్రాజెక్టులోకి 13,822క్కూసెక్కుల వరదనీరు చేరుతోంది. మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి 4.46టిఎంసిల నీటినిలువ సామర్ధానికి గాను ఇప్పటికే 3.65టిఎంసిల నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటిని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 12,528క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News