27కు పెరిగిన మరణాల సంఖ్య
బుధవారం నుంచి మరింత వర్షం
కోచి: కేరళలో కురుస్తున్న భారీ వానలు ఊహించనంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగింది. కొట్టాయం జిల్లాలోని కూట్టిక్కల్, ఇడుక్కీ జిల్లాలోని కొక్కయర్‌లో శిథిలాల నుంచి మరిన్ని మృత దేహాలను వెలికి తీశారు. వీటికితోడు కొజికోడ్, త్రిస్సూర్, పలక్కాడ్ జిల్లాలో మునిపోయినవారు కూడా ఉన్నారు. ఇడుక్కీ జిల్లా కంజర్‌లో వరద నీటికీ కారు కొట్టుక్కుపోవడంతో ఇద్దరు వ్యక్తులు శనివారం చనిపోయారు.
ఇడుక్కీ డ్యామ్ వద్ద ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సోమవారం ఉదయం ఆ రిజర్వాయర్ నీళ్లు 2396.86 అడుగుల ఎత్తును తాకింది. ఆ రిజరాయర్ పూర్తి స్థాయి 2403 అడుగులే. ఎర్నాకులం కలెక్టర్ జాఫర్ మలిక్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో “ ఆ డ్యామ్ నిర్వహణను కేరళ ఎలెక్ట్రిసిటీ బోర్డ్(కెఎస్‌ఇబి) చూస్తోందని, ఆ డ్యామ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని, అయితే ఆ సంస్థ డ్యామ్ నీరు సోమవారం సాయంత్రానికి రెడ్ అలర్ట్ స్థాయి 2397.86ను తాకవచ్చని, ఇంకా మంగళవారం గరిష్ఠ స్థాయి 2398.86ని తాకవచ్చని తెలిపింది” అని పేర్కొన్నారు. నీరు అతిగా చేరితే డ్యామ్ గేట్లు మంగళవారం ఎత్తివేయాల్సి ఉంటుందని, కనుక పరిసర ప్రాంతాల ప్రజలకు ముందుగానే హెచ్చరికలు చేయాల్సిందిగా ఆయన ఎర్నాకులం, ఇడుక్కీ అధికారులకు తెలిపారు. డ్యామ్ షట్టర్స్ తెరిచేసే విషయాన్ని తెలిపేందుకు తాలూకా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు కూడా తెరిచారు. ఇదిలావుండగా పథపనంతిట్ట జిల్లాలోని కక్కీ డ్యామ్ గేట్లను తెరిచారు.
డామ్‌లు, రిజర్వాయర్లలో పెరగుతున్న నీటి మట్టం గురించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ వాకబు చేశారు. బుధవారం నుంచి మళ్లీ వానలు పడనున్నందున భారత వాతావరణ శాఖ కేరళలోని 11 నుంచి 14 జిల్లాల్లో కోడ్ ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది.