Sunday, December 22, 2024

హిమాచల్ కుండపోతతో జనవిలయం

- Advertisement -
- Advertisement -

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలతో సంభవించిన పలు దుర్ఘటనల్లో 33 మంది మృతి చెందారు. పలు ప్రాంతాలలో పొంగిపొర్లుతున్న నదుల ధాటికి బ్రిడ్జిలు కొట్టుకుపొయ్యాయి. కొండచరియలు, విరిగిపడ్డ మట్టిదిబ్బలతో ప్రత్యేకించి పర్యాటక కేంద్రం సిమ్లా సమీప ప్రాంతాలలో భయానక స్థితి ఏర్పడింది. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన సోమవారం దినం సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంలో పూజాదికాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ దశలో భక్తులు పూజలు చేస్తూ ఉండగానే కొండచరియలు విరిగిపడటంతో శివాలయం కుప్పకూలింది. దీనితో శిథిలాల కింద ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను వెలికితీశారు. మట్టిరాళ్ల కుప్పల కింద మరింత మంది పడి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాలలో రహదారులు జలాశయాలను తలపించాయి. దీనితో వాహనాల రాకపోకలు నిలిచిపొయ్యాయి. సిమ్లాలో సోమవారం కూడా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు మృతి చెందారు.

ఇక్కడ సహాయక చర్యలలో ముందుగా ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఫాగ్లీ ప్రాంతంలో శిథిలాల మధ్యలో కూరుకుపోయిన వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 17 మందిని రక్షించామని స్థానిక ఎస్‌పి సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. పలు చోట్ల నివాస గృహాలు కుప్పకూలాయి. దీనితో భోరున పడుతున్న వానల నడుమ జనం రోడ్డునపడాల్సి వచ్చింది. పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ తెలిపారు. శివాలయం వద్ద పలు మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాలకు గాను తొమ్మిది జిల్లాల్లో వర్షం విపరీత నష్టం కల్గించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను సోమవారం మూసివేశారు.

వర్ష ఉపద్రవంతో 752 రోడ్లను మూసేసినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆరేషన్ సెంటర్ ప్రకటన వెలువరించింది. తొమ్మిది జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నట్లు తెలిపారు. సోలాన్ జిల్లాలోని జాడన్ గ్రామంలో ఆదివారం రాత్రి కుండపోత వానలు, పిడుగుపాట్లతో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. కాగా మండి జిల్లాలోని సంబల్ గ్రామంలో వరదనీరు ప్రవాహంలా పారుతూ భయాన్ని పుట్టిస్తున్నప్పటి దృశ్యాల వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో ఉంచారు. ఈ నీటి ధాటికి ఏడుగురు కొట్టుకుపొయ్యారు.

మరో వైపు జతోగ్ సమ్మర్ హిల్స్ రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్ కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోగా ట్రాక్ వేలాడుతూ ఉన్న ఫోటోలను వెలువరించారు. కాందఘాట్ సిమ్లా మధ్య పరిస్థితి తీవ్రత నేపథ్యంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కుంభవృష్టి పలు చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతాలకు దారితీసింది. కంగ్రాలో 270 ఎంఎంలు, ధర్మశాలలో 250 ఎంఎంలు, సుందర్‌నగర్‌లో 168 ఎంఎంలు, మండీలో 140, జుబ్బర్‌హతిలో 132, సిమ్లాలో 126, బెర్తిన్‌లో 120 , ధౌలకౌన్‌లో 111, నహాన్‌లో 107 ఎంఎంల వర్షపాతం రికార్డు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News