Tuesday, September 17, 2024

తేరుకుంటున్న తెలుగు రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

తేరుకుంటున్న తెలుగు రాష్ట్రాలు
ఊపిరిపీల్చుకున్న ముంపు ప్రాంతాల ప్రజలు
హైవేలపై నిలిచిపోయిన రాకపోకలు మళ్లీ ప్రారంభం
ధ్వంసమైన రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, నిలిచిపోయిన
విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తున్న అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు దెబ్బకు అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వర్ష బీభత్సానికి తెలంగాణ, ఆంధ్రప్రదేవ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముంపు ప్రాంతాలలో రెండు రోజులుగా కరెంటు సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు చెబుతున్నారు. ఆహారం వండుకునే పరిస్థితి లేదని ప్రభుత్వం ఇచ్చిన భోజనం ప్యాకెట్లు, తాగు నీటితో జీవించి ఉన్నామని చెబుతున్నారు.

సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం వరద తగ్గడంతో కొంత ఉపశమనం కలిగిందని ప్రజలు తెలిపారు. ఇటువంటి విలయాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదని పలువురు తెలిపారు. పొలాలన్నీ చేతికందకుండా అయిపోయాయని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాత్రంతా కాస్త ఎత్తుగా ఉన్న ఇళ్లలో తలదాచుకున్నామని స్థానికులు తెలిపారు. కొన్ని ఇళ్లు కూలిపోయి పలువురు నిరాశ్రయిలయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఎపిలో విజయవాడ ప్రాంతాలు అయితే వరదల థాటికి అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు ఏకమై పొంగిపొర్లి.. గ్రామాలు, కాలనీల్లోని లోతట్లు ప్రాంతాలను ముంచెత్తాయి.

పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు ధ్వంసం కావడం, మరోవైపు రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో జనాలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు దాదాపు బంద్ అయ్యాయి. ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి ఎటూ వెళ్లలేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద తగ్గడంతో ముంపు ప్రాంతాలు తేరుకుంటున్నాయి. హైవేలపై నిలిచిపోయిన రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ధ్వంసమైన రోడ్లను, రైల్వే ట్రాక్‌లను, పలు ప్రాంతాలలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్దరిస్తున్నారు.

కొట్టుకుపోయిన కార్లను చూసి లబోదిబోమంటున్న యజమానులు
నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. మున్నేరు వరద హైవేపై ప్రవహించటం వల్ల రోడ్డు మార్జిన్ వరదకు కొట్టుకుపోయింది. వరదకు 13 కార్లు, ఐదు బైకులు, ఒక ఆటో కొట్టుకుపోయాయి. మున్నేరు వరద తగ్గటంతో ఐతవరం వద్ద పొలాల్లో కొట్టుకుపోయిన కార్లు, వాహనాలు బయటపడ్డాయి.

ప్రాణ భయంతో కార్లు హైవేపై పెట్టి వెళ్లిన యజమాలు కుటుంబ సభ్యులు వచ్చి వాహనాలు చూసుకొని లబోదిబోమంటున్నారు. వాటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పొలాల మధ్యలో వరదలో ఉండటం వలన ఇబ్బంది కరంగా మారింది. హైవేపై వరద ప్రవహించిన ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. దీన్ని హైవే టోల్ ప్లాజా నిర్వాహకులు తొలగించారు. విజయవాడ- హైదరాబాద్ రహదారిపై రాకపోకలు కొనసాగుతూ ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా,ఆర్ అండ్ బి అధికారులు రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు.

మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది
మున్నేరు నది వరద ఖమ్మం నగరానికి తీవ్ర నష్టం చేకూర్చింది. మున్నేరు పరివాహక కాలనీల్లో ప్రజలు తీవ్రంగా నష్టం పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ప్రజలు పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 36 అడుగులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

24 గంటల పాటు పునరావాస కేంద్రాల వద్ద ఉన్న ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకున్నారు. తీరా తమ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి భీతావాహ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న సమస్తం నానిపాడైపోయాయి. విలువైన టివి, కూలర్, ఫ్రీజ్, ల్యాప్‌టాప్ తదితర విలువైన వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నిత్యావసరాలు సైతం బురదమయం అయ్యాయని, వీధుల్లో బురద, ఇంట్లో బురద దీన్ని ఎలా పోగోట్టుకోవాలో తెలియని పరిస్థితి వచ్చిందంటూ బాధితులు వాపోయారు. మున్నేరు వరదకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద తగ్గి బురదమయంగా మారిన కాలనీలలో త్వరితగతిన ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు.

గోదారి పరవళ్లు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు
ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మూడు రోజులుగా వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ మొత్తం 41 గేట్ల ద్వారా రెండున్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరాంసాగర్ గేట్లెత్తడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ డ్యామ్ నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఒడ్డున నిలబడి నీటి అలలు, పరవళ్లను చూస్తూ ఫోటోలు దిగుతున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నందున, పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

విజయవాడలో ముంపు ప్రాంతాల్లో తగ్గిన వరద
విజయవాడ ముంపు ప్రాంతాల్లో క్రమంగా వరద తగ్గింది. యనమలకుదురు ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు వెనక్కి వెళ్లింది. దీంతో ఇళ్లల్లోకి ప్రజలు చేరుకున్నారు. ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో ప్రజలు నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. పునరావాసస కేంద్రాలు, ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భోజనం అందజేస్తున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్లని పునరావాస కేంద్రాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు మత్స్యకారులు తరలించారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక పడుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యనమలకుదురు పెదపులిపాక ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.

తెలంగాణ -ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంది ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారి పైకి చేరిన గోదావరి వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News