అంకారా( టర్కీ ): టర్కీలో గత నెల భూకంపానికి గురైన రెండు ప్రావిన్స్‌ల్లో పెనుగాలివానతో వరదలు ముంచుకొచ్చి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కనీసం ఐదుగురైనా గల్లంతై ఉంటారని అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ అడియామాన్ ప్రావిన్స్‌లో టట్ నగరంలో భూకంప నిర్వాసితులైన కుటుంబం ఉంటున్న కంటైనర్ ఇల్లు తుడిచిపెట్టుకుపోయింది. ఈ కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందారని గవర్నర్ నుమాన్ హటిపోగ్లు చెప్పారు.
పొరుగునున్న శాన్‌లియుర్ఫా ప్రావిన్స్‌లో నలుగురు మృతి చెందారని ఆ ప్రావిన్స్ గవర్నర్ సలిహ్ ఆయ్‌హాన్ తెలియజేశారు. వీరి మృతదేహాలు వరద నీటితో నిండిన ఒక అపార్టుమెంట్ దిగువ భవనంలో కనిపించాయి. శాన్‌లియుర్పా లో ఒక వీధిని పూర్తిగా వరదనీరు ముంచెత్తడం, కార్లు తుడిచిపెట్టుకుపోవడం, అక్కడ ఒకరు ఆపద నుంచి బయటపడడం ఇవన్నీ టెలివిజన్ ఫుటేజీలో కనిపించాయి. భూకంప బాధితులు తలదాచుకుంటున్న శిబిరాలు వరద నీటితో తడిసి ముద్దయి పోవడంతో ఆ గుడారాల నుంచి అనేక మందిని ఖాళీ చేయించారు. ఆస్పత్రి నుంచి రోగులను కూడా ఖాళీ చేయించారు. ఈ రెండు ప్రావిన్సుల్లో డజను గజ ఈతగాళ్లు వంతున రిస్కు ఆపరేషన్ చేపట్టారు.