Sunday, December 22, 2024

అస్సాం, మేఘాలయాలో వరద బీభత్సం… 31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Floods kill 31 in Assam, Meghalaya

 

గువాహటి : అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలకు రెండ్రోజుల వ్యవధిలో అస్సాంలో 12 మంది మరణించగా, మేఘాలయలో 19 మంది మృతి చెందారు. మేఘాలయలో మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం సిఎం సంగ్మా ప్రకటించారు. మేఘాలయ లోని చిరపుంజీ, మౌసిన్‌రామ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 82 ఏళ్లలో (1940 తర్వాత ) ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం.

అస్సాంలో మృతుల సంఖ్య 17 కు చేరిక

అస్సాంలో ఎడతెరిపి లేని వర్షాలకు వరద బీభత్సం సంభవించి ఈ ఏడాది ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 17 కు చేరింది. శుక్రవారం మరో తొమ్మిది మంది చనిపోగా, వీరిలో ఇద్దరు పిల్లలున్నారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 2930 గ్రామాలకు ఈ విపరీతం సాగి దాదాపు 19 లక్షల మంది బాధితులయ్యారు. 28 జిల్లాల్లోని గ్రామాల్లో గంటగంటకు వరద నీటి మట్టం పెరుగుతోంది. నల్బరీ, బజలీ, డర్రాంగ్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. బజలీ జిల్లాలో 3.55 లక్షల మంది డర్రాంగ్ జిల్లాలో 2.90 లక్షల మంది వరదలకు బాగా నష్టపోయారు. 43,338.39 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగాయి. లక్ష మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి 373 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. కొపిలి, బ్రహ్మపుత్ర, బేకి, మానస్, పగ్లాడియా, పుతిమారి, జియా భారలి నదులు అనేక ప్రాంతాల్లో ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మకు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. అన్ని సహాయ చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News