హైదరాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో పూల వ్యాపారం చేస్తున్న యువకుడిని కిడ్నాప్ కలకలం సృష్టించింది. సంఘటన ఈ నెల 15వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందిజ. రాజును ముగ్గురు వ్యక్తులు ఈ నెల 15వ తేదీన కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడిమల్కాపూర్ మార్కెట్‌లో పూల వ్యాపారం చేసే రాజు ఏపీలోని కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనే పూల వ్యాపారి దగ్గర రూ.1,50,000 పువ్వులను కొనుగోలు చేశాడు. పువ్వుల డబ్బులు రాజు దరు వ్యాపారికి ఇవ్వలేదు. తన దగ్గర డబ్బులు లేవని ఆ తర్వాత ఇస్తానని చెప్పాడు. గత కొద్దిరోజులుగా రాజుని డబ్బులు ఇవ్వాలని వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు.
ఒత్తిడి తేవడంతో రాజు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి డబ్బులు వసూలు చేసి తీసుకుని రావాలని రాజు వద్దకు ముగ్గురు వ్యక్తులను పంపించాడు. వారు వచ్చి రాజును డబ్బులు అడగడంతో తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో రాజును కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారులో వెళ్తుండగా మార్గమధ్యలో రాజు డయల్ 100 నంబరుకు తన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఫోన్ లొకేషన్ ద్వారా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.