గ్రామీణ రహదారుల వెంబడి పెద్ద ఎత్తున్న పూల మొక్కలు
మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్‌కు పెరిగిన ప్రాధాన్యత
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని రహదారుల వెంట ఏర్పాటు చేసిన పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎనిమిదేళ్లుగా హరితహారంలో భాగంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న రోడ్డుకు ఇరువైపుల విభిన్న రకాలు పూల మొక్కలు, పండ్ల మొక్కలను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 32 గ్రామీణ జిల్లాల పరిధిలో 9360 కిలో మీటర్ల మేర మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టగా.. 9342.2 కి.మీ మేరకు పూర్తిచేసి 98.81 శాతం లక్షాన్ని సాధించారు. నిజామాబాద్, వరంగల్, వనపర్తి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 250 కిలో మీటర్ల మేరకు రహదార్లు వెంబడి మొక్కలను నాటగా.. మిగిలిన ప్రతి జిల్లాలో 300 కిలోమీటర్ల మేర మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వంద శాతానికి పైగా ప్లాంటేషన్‌ను చేపట్టి అగ్రభాగంలో నిలిచారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంబడి రంగు రంగుల పూల మొక్కలతో ఆహ్లదకర వాతావరణం ఉట్టిపడేలా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడానికి తగు ప్రణాళికలను రూపొందించారు. జిహెచ్‌ఎంసి,హెచ్‌ఎండిఎ, ఆర్ అండ్ బి, మున్సిపాలిటీలు, ఓఆర్‌ఆర్, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల వెంట మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున్న చేపట్టారు. ప్రధానంగా సింగిల్ లేయర్ ప్లాంటేషన్‌లో ప్రత్యేక మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణ స్థానిక సంస్థలు తమ ప్రాంతంలోని ప్రధాన రహదారుల మధ్య, ముఖ్యకూడలిలో విభిన్న పూల మొక్కలను నాటి చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. గతంలో ప్రధాన రహదారుల మీదుగా వాహనాల్లో రాకపోకలు చేసే సమయంలో సాధారణంగా భయపడేవారు..
ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం.. పచ్చదనంతో వారిలో ఆనందం.. సంతోషాన్ని నింపుతున్నాయి. మల్టీ-లేయర్ అవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించడంతో జిల్లా కేంద్రాలు, ప్రధాన పంచాయతీల్లో రహదారులలో విభిన్న రకాల పూల మొక్కలను నాటారు. దీంతో ప్రకృతి అందాలను ప్రతి నిత్యం తిలకించేందుకు ప్రజలకు సౌలభ్యంగా మారింది. అటవీ, ఉద్యానవన శాఖ అధికారుల చొరవతో పలు ప్రాంతాల్లో మొదటి వరుసలో టెకోమగౌడిచౌడీ, సీసల్పినియాపుల్చెర్రిమా, బౌగెన్‌విల్లా వంటి పూల పొదలను నాటారు. రెండో వరుసలో స్పతోడియా, తాబేబుయా, బాదం, గుల్‌మొహర్ వంటి పూల చెట్లను నాటారు. మూడో వరుసలో, పై పందిరి, వేప, రావి, పెల్టోఫోరం, మహోగని వంటి మొక్కలను నాటారు.