Wednesday, January 22, 2025

భద్రాచలం-మల్కానగిరి.. కొత్త రైల్వే లైన్‌కు ఎఫ్‌ఎల్‌ఎస్ మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వశాఖ రైళ్ల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ని మంజూరు చేసింది. ఈ లైన్లు మొత్తం కలిపి దాదాపు 2,647 కిమీ దూరం వరకు విస్తరించి ఉన్నాయి. వీటి అంచనా వ్యయం సుమారు రూ. 50,848 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా నిర్మాణపు అంచనా వ్యయం సుమారు రూ. 32.695 కోట్లతో దాదాపు 2.588 కిమీల మేర డబ్లింగ్ , ట్రిప్లింగ్ , క్వాడ్రాఫ్లింగ్ కోసం మరో 11 ప్రాజెక్టులకు ఎఫ్‌ఎల్‌ఎస్ మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వశాఖ ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరు చేసిన ముఖ్యమైన ప్రాజెక్టులలో భద్రాచలం (పాండురంగాపురం) మల్కాన్‌గిరి కొత్త రైల్వే లైన్ ఒకటి కావడం విశేషం. ఈ ముఖ్యమైన లైన్ దాదాపు 186 కిమీల మేర విస్తరించే అవకాశం ఉంది. దీని నిర్మాణపు అంచనా వ్యయం సుమారు రూ. 3.592 కోట్లుగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ లైన్ భద్రచలం టెంపుల్ టౌన్ మెయిన్ లైన్ ( రైలు నెట్ వర్క్ ) తో కలుపుతుంది. భద్రాచలం ఆలయాన్ని చత్తీస్‌ఘడ్ మీదుగా ఒరిస్సాలోని మెయిన్‌లైన్‌తో అనుసంధానించడానికి ఈ నూతన రైల్వే లైన్ సహాయపడుతుంది. దీని వలన రైలు అనుసంధానంతో ఈ మార్గంలో మొదటి సారిగా అనేక కొత్త ప్రదేశాలను కలుపడమే కాకుండా ఈ ప్రాంతం సామాజిక ఆర్థిక అభివృద్ధికి దొహదపడనుంది. ఇది తెలంగాణ రాష్ట్రం నుండి చత్తీస్‌ఘడ్ మీదుగా ఒరిస్సాకు ప్రయాణికుల రాకపోకలలో సహాయం చేయడంతో పాటు వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ తదితర బహుళ కార్యకలాపాలకు కూడా ఇది సహాయపడనుంది. తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలలోని గనులు, పరిశ్రమలకు సముద్ర ఓడరేవులను కలిగిన కాకినాడ మధ్య దూరాన్ని తగ్గించడానికి కూడా ఈ లైన్ సులభతరం చేస్తుంది. ఈ నూతన రైలు మార్గం ప్రయాణీకుల , సరుకు రవాణా రెండింటినీ పెంచడంలో దోహదపడబోతోంది.

రైల్వే మంత్రిత్వశాఖ తెలంగాణలోని రైలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించడంలో భాగంగా గత తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేటాయింపులో 2014 15 సంవత్సరంలో రూ. 258 కోట్ల నుంచి రూ. 4,418 కోట్లు అంటే దాదాపుగా 17 రెట్లు పెరిగాయి. తద్వారా రాష్ట్రంలో కొత్త రైలు మౌళిక సదుపాయాల కల్పనకు దారి తీసింది. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌కు దాదాపు 575 కిలో మీటర్ల నూతన రైల్వే లైన్ జోడించనుంది. 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరు చేయడం వల్ల రాష్ట్రంలో రైలు అభివృద్ధికి మరింత ఊతమిచ్చే అవకాశం కలిగినట్లు ద. మ రైల్వే పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News