న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రవేటీకరణకు గాను ఈ ఏడాది ఆఖరున ప్రభుత్వం రెండు చట్టాల్లో సవరణలు చేపట్టే అవకాశముంది. ప్రవేటీకరణ చేపట్టేందుకు బ్యాంకింగ్ కంపెనీల చట్టం (స్వాధీనం, బదిలీ) 1970, అలాగే బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980 సవరణలు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. రెండు దశల్లో బ్యాంకుల జాతీయం ఉంటుందని, బ్యాంకుల ప్రైవేటీకరణకు చట్టాల మార్పులు చేపట్టాల్సి ఉందని వారు తెలిపారు. బడ్జెట్ సెషన్‌లో చట్టాల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా, వచ్చే శీతాకాల సమావేశాల్లో సవరణలు చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జరుగుతున్న సెషన్‌లో ఆర్థిక బిల్లు 2021తో పాటు 38కి పైగా బిల్లు ప్రవేశపెట్టనున్నారు. వీటిలో 202021కు గ్రాంట్లకు అనుబంధ డిమాండ్లు, కిప్రోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ 2021 చట్టాలు కూడా ఈ బడ్జెట్ సెషన్‌లో చర్చించనున్నారు.
ఆర్‌బిఐ బోర్డు సభ్యులతో నిర్మల భేటీ..
ఆర్‌బిఐ బోర్డు సభ్యులకు ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. కేంద్ర బడ్జెట్ 202122 ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా రిజర్వు బ్యాంక్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షత వహించారు. సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బిఐ, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) బోర్డు సభ్యులతో ఆర్థికమంత్రి సమావేశమవుతారు. 587వ ఆర్‌బిఐ సెంట్రల్ బోర్డు సమావేశానికి హాజరైన సీతారామన్ సభ్యులతో పలు విషయాలపై చర్చించి, బడ్జెట్‌లోని కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి సభ్యులకు వివరించారు. బడ్జెట్‌పై ఆర్థికమంత్రిని ప్రశంసిస్తూ బోర్డు సభ్యులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారని ఆర్‌బిఐ తెలిపింది. బడ్జెట్ 202122 ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రపంచ, దేశీయ సమస్యలు, రిజర్వు బ్యాంక్ చేపడుతున్న కార్యక్రమాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇంకా బ్యాంకుల్లో సమస్యలను పరిష్కరించే విచారణ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మార్గాలపైనా చర్చ జరిగింది. బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, ఆర్థిక సేవల కార్యదర్శి దెబాసిష్ పాండ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో సీతారామన్‌తో పాటు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, పెట్టుబడులు, డిఐపిఎఎం(ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే కూడా పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి రూ.34.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.