కొత్త ఐటి ఇ పోర్టల్‌లో సమస్యలపై వివరణ కోరిన కేంద్రం
పోర్టల్‌ను ప్రారంభించి రెండున్నర నెలలు కావొస్తోంది
ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేకపోయిన ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ : కొత్త ఆదాయం పన్ను ఇ పోర్టల్‌లో సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో? చెప్పాలని ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సిఇఒ సలిల్ పరేఖ్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది. ఈ పోర్టల్‌ను ప్రారంభించి రెండున్నర నెలలు కావొస్తోంది. ఈ కొత్త పోర్టల్ బాధ్యతలు అప్పగించిన ఇన్ఫోసిస్ ఇప్పటికీ ఈ సమస్యలను పరిష్కరించలేకపోయింది. దీంతో ప్రభుత్వం కంపెనీ సిఇఒకు సమన్లు పంపింది. ఆగస్ట్ 23న సలీల్ పరేఖ్ వివరణ ఇవ్వాల్సి ఉంది. రూ. 4,241 కోట్లతో రూపొందించిన ఈ వెబ్‌సైట్ జూన్ 7న ప్రారంభించారు. అప్పటి నుండి ఈ పోర్టల్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఆగస్టు 21 నుండి ఐటి రిటర్న్ దాఖలు చేయడానికి కొత్త ఆదాయ పన్ను పోర్టల్ అందుబాటులో లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తరచూ కొత్త ఐటి పోర్టల్‌లో చలాన్ నంబర్ పనిచేయకపోవడం, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డిఐఎన్) ఆటో పాపులేషన్ పొందకపోవడం, కొత్త వెబ్‌సైట్‌లో దాఖలు చేసిన టిడిఎస్ రిటర్న్‌లు తిరస్కరణకు గురవడం జరుగుతున్నాయి. ఇంకా ఫారం 15 సిఇ/సిబి దాఖలు కావడం లేదు, వివాద్ సే విశ్వాస్ పథకం పని చేయడం లేదు, రిటర్న్ దాఖలు కావడం లేదు, రీఫండ్ సమస్య అభ్యర్థన దాఖలు కాకపోవడం, ఐటి 143 (1) ఇంటిమేషన్ ఆర్డర్లు ఓపెన్ కాకపోవడం, ఐటిఆర్ ఫారం 3, 5, 6, 7 అందుబాటులో ఉండడం లేదు. ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అన్ని పనులు నిలిచిపోయి ఐటి చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిఎ అభయ్ శర్మ మాట్లాడుతూ, ఐటి శాఖ పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో పనిచేస్తోందని అన్నారు. రిటర్నుల దాఖలు, డిపార్ట్‌మెంట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా అప్పీల్స్ దాఖలు చేయడం వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఆదాయపు పన్ను వెబ్‌సైట్ నుండి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. కొత్త పోర్టల్‌ను ప్రారంభిస్తూనే, మరోవైపు పాత పోర్టల్‌ను నడిపిస్తే సమస్యలు ఉండేవి కావని అన్నారు. వీలైతే పాత పోర్టల్‌ను పునరుద్ధరించాలని ఆయన సూచించారు.